నేలవేముపుష్పాలు, ఫలాలు సెప్టెంబరు-డిసెంబరు మాసాలలో లభిస్తాయి. నేలవేము మొక్క ఇంచుమించు సంవత్సరం పొడవునా పెరుగుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా అరణ్యాలలోను, బీడు భూములలోను విస్తృతంగా పెరుగుతుంది.
నేలవేము ఉపయోగాలు
ఈ మొక్కను సమూలంగా వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కో కాల్మెగిన్, ఆండ్రోగ్రాఫిన్, పానికోలిన్, ఆండ్రోగ్రాఫోలిడ్ వంటి రసాయనాలు ఉంటాయి. ఈ మొక్క అమిత చేదును కలిగి ఉంటుంది. ఉత్తరభారతదేశంలో ఇంటింటా పిల్లలకు వచ్చే క్రిమి వ్యాధులు, చర్మ వ్యాధులు, కడుపునొప్పి, ఆకలి లేకపోవడం వంటి వాటి నివారణకు ఈ మొక్కను వాడతారు. దీనిని అలూయి అని కూడా అంటారు.కాలేయాన్ని చురుకుగా పనిచేయించడంలో ఇది అమోఘంగా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా మలేరియా జ్వర నివారణకు ముఖ్యమైన మందు. మధుమేహ వ్యాధిని కూడా తగ్గించే గుణముంది.
నేలవేము మొక్కకు ముఖ్యంగా అన్ని రకాల జ్వరాలను నివారించే శక్తి ఉంది. మలబద్ధకం తొలగించడంలోను, శ్వాసకోస వ్యాధులు, దగ్గు, ఒంటికి నీరు పట్టడం, దాహం, కడుపులో మంట, కాలేయ సంబంధ వ్యాధులు, నీరసం, విరోచనాలు, అజీర్ణం, క్రిమి నివారిణిగా ఉపయోగపడుతుంది. మొక్క పొడిని, మిరియాల పొడితో సమానంగా లోనికి తీసుకుంటే మలేరియా జ్వరం తగ్గుతుంది. పచ్చి పత్రాలను వాముతో కలిపి తీసుకుంటే జీర్ణసంబంధ వ్యాధులు నివారణ అవుతాయి. కడుపులోని క్రిములు పడిపోతాయి.
పచ్చి పత్రాలు, నల్ల ఈశ్వరి పత్రాలను సమంగా తీసుకుని కొద్ది కొద్దిగా లోనికి తీసుకుంటే శరీరానికి శక్తినిస్తుంది. పత్రాల కషాయాన్ని గాని, దానితోబాటు యాలకులు లేదా లవంగాలు కలిపి గాని తీసుకుంటే అజీర్ణం, కడుపులో వాయువు ఏర్పడడం, పిల్లల్లో నీళ్ళ విరేచనాలు, కడుపులో బాధలు పోతాయి. పత్రాల కషాయాన్ని రెండేసి చెంచాల చొప్పున లోనికి తీసుకుంటే నరాల నొప్పులు, అజీర్ణం, నిస్సత్తువ, జిగట విరోచనాలు తగ్గుతాయి. కాలేయం చురుగ్గా పనిచేస్తుంది.
వేర్లను విరోచనాలు, కడుపునొప్పి తగ్గించడానికి వాడతారు. మొక్క కషాయాన్ని వాడితే మలేరియా జ్వరం తగ్గుతుంది. ఏలికపాములు పడిపోతాయి. నేలవేము మొక్క పొడిని ఆవనూనెతో కలిపి పైన పూస్తే దురదలు తగ్గుతాయి. మొక్క పొడిని నిత్యం వాడుతుంటే కడుపులో వాయువు తగ్గుతుంది. కాలేయం పిత్తాశయ వ్యాధులు నశిస్తాయి. రక్తశుద్ధి జరుగుతుంది.
ఈ మొక్కను ఉపయోగించి తయారుచేసిన ‘కిరాత’ టాబ్లెట్లను తేనెతో కలిపి ప్రతి ఉదయం తీసుకుంటూ ఉంటే మలేరియా వ్యాధి నివారణ అవుతుంది. దీనిని ఉపయోగించి తయారుచేసిన టైపోలి అనే మందు వైరస్ వల్ల వచ్చే కామెర్ల వ్యాధికి అమోఘంగా పనిచేస్తుంది. దీని నుండి తయారుచేసిన చివత్రాదిలేపాన్ని చర్మవ్యాధుల నివారణకు పైపూతగా వాడతారు.
ఆయుర్వేద మందుల్లో నేలవేము : తిక్తకాఘృతం, గోరోచనాది గుళిక, చందనాసవం, పంచతిక్త కషాయం మొదలైన మందుల్లో నేలవేము వినియోగిస్తారని ఆయుర్వదే వైద్యలు చెబుతున్నారు.