పాముకాటుకు విరుగుడుగా ’నల్లఈశ్వరి‘


అరిష్టలోకియేసి కుటుంబానికి చెందిన నల్ల ఈశ్వరి శాస్త్రీయనామం అరిష్టలోకియా ఇండియా లిన్నెయస్. ఇది ఐదు నుంచి ఆరు మీటర్ల పొడవు పెరిగే బహువార్షిక తీగ. నల్లఈశ్వరి మొక్కకు భూమిలో దుంపవంటి వేర్లుంటాయి. పత్రాలు కణుపుకు ఒకటి చొప్పున దీర్ఘచతురస్రాకారంలో, చివరిభాగంలో కొంచెం వెడల్పుగా, పాము పడగలాగ ఉండి, కొనభాగం సూదిగా ఉంటాయి. పుష్పాలు గ్రీవాలలో ఏర్పడతాయి. ఊదా-ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకర్షణపత్రావళి గొట్టం వలె బోను మాదిరిగా ఉంటుంది.

ఫలం, గుళిక, విత్తనాలకు రెక్కలుంటాయి. ముదిరిన పత్రాలపై నల్లటి నుసి ఉంటుంది. నలిపితే తమలపాకు వాసన వస్తుంది. నల్లఈశ్వరి పుష్పాలు సెప్టెంబరు నెలలోను, ఫలాలు ఫిబ్రవరి నుంచి మార్చి మాసాలలో ఏర్పడతాయి.  ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ లోని అరణ్యాలు అంతటా పొదలపైన పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో పంటపొలాల వెంబడి కంచెలపైన పెరుగుతుంది.
నల్లఈశ్వరి ఉపయోగాలు

నల్లఈశ్వరి మొక్క వేర్లను, పత్రాలను వైద్యపరంగా ఉపయోగిస్తారు.  ఈ మొక్క వేరులో అరిస్టలోఖిక్ ఆమ్లం, ఆరిస్టలోలమైడ్, ఈశ్వరైన్, ఈశ్వరోన్, అరిస్టలోఖీన్ వంటి పెక్కు రసాయనాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మొక్క వేరును పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. తెల్లటి పత్రాలున్న రకాన్ని తెల్ల ఈశ్వరి అంటారు. ఈ వేరును దగ్గరుంచుకుంటే త్రాచుపాము దగ్గరకు రాదని విశ్వాసం. అన్ని రకాల విష జంతువుల కాటుకు విరుగుడుగా పనిచేస్తుంది. వేరు రక్తాన్ని శుద్ధిచేస్తుంది. చర్మవ్యాధులను నిర్మూలిస్తుంది. గాయాలను మాన్పుతుంది. త్రిదోషహరి, ఆకలిని పుట్టిస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. కడుపులోని క్రిములను వెడలగొడుతుంది. దేహంలోని మంటను తగ్గిస్తుంది.

వేరు కషాయాన్ని నపుంసకత్వం, పిల్లల జీర్ణసంబంధ వ్యాధులు, జ్వర నివారణలోను వాడతారు. వేరుకు గర్భస్రావాన్ని కలిగించే గుణముంది.  తాజాపత్రాల రసాన్ని పిల్లల్లో వచ్చే దగ్గు నివారణకు వాడతారు. విత్తనాలు పొడిదగ్గును తగ్గిస్తాయి. కుష్ఠు, బొల్లి వ్యాధుల నివారణకు, దీని వేరును తేనెలో నూరి మచ్చలపై పూయాలి. వేరును మిరియాలతో తీసుకుంటే కలరా, నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి.  వేరు, మిరియాలు,అల్లం కలిపి తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. అన్ని రకాల జీర్ణసంబంధ వ్యాధులు నివారణ అవుతాయి.

బ్రాంఖియల్ ఆస్థమా, దగ్గు, గుండెజబ్బులు, మానసిక వ్యాధులు నివారణ అవుతాయి. వేరును నీటితో నూరి రెండు నుంచి నాలుగు చెంచాల రసాన్ని తరచూ పట్టిస్తుంటే పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుంది. వేరును నిత్యం వాడుతుంటే అధిక రక్తపోటు తగ్గుతుంది. వేరును నూరి దానిని పైన పూస్తే దురదలు తగ్గుతాయి.

ఆయుర్వేద మందులల్లో నల్లఈశ్వరి : నీలిదలాది తైలం, పరంట్యాది తైలం, పాతాది గుళిక, శతావరిఘృతం, మజునూన్-ఎ-ఫల్సాఫా వంటి వాటిలో నల్లఈశ్వరిని వినియోగిస్తారని ఆయుర్వేద వైద్యలు చెబుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.