చిరుబొద్ది ఉపయోగాలు
చిరుబొద్ది పత్రాలు, వేరు, బెరడును వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కలో బెర్బీరైన్, సెపీరైన్, సిస్సాంపిలైన్, హయటైన్, హయటెనైన్, మినిస్మైన్, సిస్సామైన్, సిస్సాంపిరైన్ వంటి పెక్కు రసాయన పదార్ధాలుంటాయి.చిరుబొద్ది వేరును జ్వర నివారణలోను, మూత్రాన్ని జారీచేయడానికి, మలబద్ధకం, అజీర్ణం, విరోచనాలు, మూత్రసంబంధ వ్యాధుల నివారణలోను వాడతారు. పత్రాల రసాన్ని గజ్జి, చిడుము, పుండ్లు తగ్గడానికి పైన పూస్తారు. గుండె జబ్బులు, త్రిదోషహరి, విషానికి విరుగుడుగాను ఉపయోగపడుతుంది. మూత్రాశయంలోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది. వేరు, పత్రాల రసాన్ని నూనెలో కలిపి చర్మంపై పూస్తే దురదలు తగ్గుతాయి. వేరు రసాన్ని పాము, తేలు కాటువేసిన ప్రదేశంలో పూస్తే విషహరంగా పనిచేస్తుంది. వేరు కషాయాన్ని లోనికి తీసుకుంటే మూత్రాశయంలోని రాళ్ళు కరిగిపోతాయి. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. జీర్ణాశయ సంబంధ వ్యాధులు నివారణ అవుతాయి.
చిరుబొద్ది వేరును మిరియాలు, ఇంగువ, అల్లంతో కలిపి తీసుకుంటే అజీర్ణం, కడుపునొప్పి తగ్గుతాయి. కడుపులోని క్రిములు పడిపోతాయి. గుండెకు బలాన్నిస్తుంది. కఫాన్ని వెడలగొడుతుంది. ఆస్థ్మా, దగ్గు, పడిశం, జ్వరాలు, మూత్రపిండాల వ్యాధులు, విరోచనాలు, మూలశంఖ, అల్సర్లను తగ్గించే గుణం ఉంది.
వేరును స్త్రీల రుతుసంబంధ వ్యాధుల నివారణలోను, గనేరియా నివారణలోను, ప్లీహ వ్యాధుల నివారణలోను వాడతారు. పత్రాల రసాన్ని, కండ్ల వ్యాధులు, చర్మవ్యాధులు, కాలిన గాయాలు, దెబ్బలు తగ్గడానికి వాడతారు. వేరు కషాయాన్ని వాడితే మూత్రపిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి.
ఆయుర్వేద మందులల్లో చిరుబొద్ది : గంగాధర చూర్ణం, కుటజాష్టక క్వతం, పిప్పలాసవం, యోగరాజగుగ్గులు వంటి మందుల్లో చిరుబొద్దిని వినియోగిస్తారని వైద్యులు చెబుతున్నారు.