పత్రకాలు 8-15 జతలు ఉంటాయి. చివర ఒక పత్రకం మాత్రమే ఉంటుంది. పుష్పాలు పత్రాలు రాలిపోయిన తర్వాత ఏర్పడతాయి. పుష్పాలు కొమ్మల చివర గుత్తులుగా ఏర్పడతాయి. పుష్పాలు తెల్లగా, మధ్యలో ఎరుపురంగు కలిగి ఉంటాయి. ఫలాలు మూడు కోణాలతో ఉండి మూడు భాగాలుగా బ్రద్దలవుతాయి. విత్తనాలు హృదయాకారంలో ఉంటాయి.
పుష్పాలు ఫిబ్రవరి-ఏప్రిల్ మాసాలలోను, ఫలాలు మార్చి-మే మాసాలలోను ఏర్పడతాయి. జిగురు నవంబరు-జూన్ వరకు లభిస్తుంది. ఈ జిగురు మంచి సువాసన ఉంటుంది. గుగ్గిలం ఆంధ్రప్రదేశ్ లో అన్ని అరణ్యాలలోను పెరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో అడ్డతీగల సమీపంలోని డి.భీమవరం ప్రాంతం కొండలపై విస్తారంగా పెరుగుతోంది.

గుగ్గిలం ఉపయోగాలు
గుగ్గిలం మొక్క జిగురు, బెరడును వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కలో కాడివీన్, ఎలినియోల్, జెరానియాల్, బోర్నిల్ వంటి అనేక రసాయనాలు ఉంటాయి. చర్మవ్యాధుల నివారణలోను, కఫ, వాత, నివారణలోను, మూలశంఖ నివారణలోను వాడతారు. ఈ మొక్కను గుండెకు బలాన్నివ్వడంలోను, నిస్సత్తువను పోగొట్టడంలోను, కడుపులో వాయువును తొలగించడంలోను, తెలివితేటలు పెంచడంలోను, జ్ఞాపకశక్తిని పెంచడంలోను, మూర్ఛ, పాముకాటుకు విరుగుడుగాను ఉపయోగిస్తారు.
బెరడును విరోచనాలు, మూలశంఖ, చర్మవ్యాధులు, అల్సర్ లు, దగ్గు నివారణలో వాడతారు. జిగురును(నిర్యాసం) కురుపులు, కీళ్ళనొప్పులు, మూలశంఖ, సిఫిలిస్, గ్రంధులను కరిగించడానికి యాంటీసెప్టిక్ గాను, విరోచనాలు తగ్గడానికి వాడతారు. రాత్రి నిద్రలో పోయే మూత్రాన్ని అరికడుతుంది. జిగురుతో తయారుచేసిన ‘శల్లకి’ అనే మందును గృధవాతం, కీళ్ళనొప్పులు తగ్గడానికి వాడతారు. జిగురును, కొబ్బరినూనెతో కలిపి లేదా నిమ్మరసం కలిపి పైన పూస్తే వ్రణాలు తగ్గుతాయి.
జిగురును, నేతితో కలిపి తీసుకుంటే గనేరియా వ్యాధి నివారణ అవుతుంది. జిగురును కొబ్బరినూనెతో కలిపి తలకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జిగురును లోనికి తీసుకుంటే శరీరంలో ఉన్న క్రొవ్వు తగ్గుతుంది. శ్వాసకోశ వ్యాధులు నివారణ అవుతాయి. జిగురు స్త్రీల ఋతుసంబంధ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు. కామెర్లు, తామర, విరోచనాలు, అజీర్ణం, మూత్రసంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగస్తారు. గాయిటర్, గౌట్ తగ్గుతాయి.