చింతచెట్టు లేతకాయలు వగరును పులుపును గల రుచి కలిగి ఉంటాయి. ముదిరిన కాయలు పుల్లగా ఉంటాయి. పండిన తరువాత పులుపును, తీపి కలిసిన రుచితో ఉంటాయి. ఉష్ణవీర్యమైనది. ఆమ్లవిపాకము కలది. లఘుగుణము వాతహరమైనది. మిక్కిలి పైత్యకరము. రక్తదోషమును కలిగించును. విరేచనము చేయును. కడుపుబ్బును పుట్టిస్తుంది. ఉబ్బును కలిగిస్తుంది. వాపులను పక్వము చేస్తుంది. వ్రణదోషములను హరించును. ఆకు వాపులను హరించును. రక్తదోషము వలన గలిగిన వ్యధను బోజేయును. చింతయొక్క క్షారము శూలలను మందాగ్నిని హరించును.గుల్మములను హరించును. వగరు, పులుపు, తీపియును గల రుచిగా ఉంటుంది. అగ్ని వృద్ధిని జేయును. వాతకఫములను పోగొట్టును. ప్రమేహములను అణచును.
చింతచెట్టు ఉపయోగాలు
చింతాకు దంచి నేతితోగాని, ఆముదముతోగాని, వట్టిది గాని వెచ్చచేసి పైన కాచినట్లయితే వాపులు తగ్గుతాయి. పసుపు చింతాకురసము తాగితే మశూచికము తగ్గుతుంది. చింతపండు, బెల్లపునీళ్ళు, దాల్చినచెక్క, ఏలకులు, మిరియాలు కలిపి ఉండలుగా చేసి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే అరోచకము పోవును. మిరియాలు వేసిన చింతపండు వేడి చారు త్రాగినట్లయితే పడిశము తగ్గును.
చింతపండు గుంజు, అరటిదుంప రసము, తాటిమట్టల రసము కలిపి కాచి పైన పూసినట్లయితే వాతనొప్పులు తగ్గును. నువ్వులనూనెలో చింతపండు కలిపి సౌవీరాంజనమును కలిపి లేక ఎర్రమన్ను కలిపి పైన కాచిన అస్థిభగ్న బాధ తగ్గుతుంది. చింత బెరడు కాల్చి తీసిన భస్మము గాని, వండిన చింతకాయల డొలకలు కాల్చి తీసిన క్షారముగాని అనుపాన విశేషమున గుల్మముల నన్నింటిని హరించును.
చింతగింజలు పై పొట్టుతీసి ఎండబెట్టి చూర్ణము చేసి ఆ చూర్ణము పాలతోగాని, తంగేడుపువ్వు కషాయముతో గాని, గుల్కందుతో కాని సేవించినట్లయితే శుక్రనష్టము కట్టును. మంచిగంధపు పొట్టు కషాయముతో తినిన తెల్లకుసుమలు కట్టును. చింతబెరడు క్షారము గోమూత్రముతో కలిపి ఇచ్చిన మలమూత్రములు జారీయై ఉబ్బులు తగ్గును. లోహములనన్నింటిని భస్మము చేస్తుంది. గంధకము తాళకమును కట్టును. గింజల గంధము పైన రాసిన తేలు విషము దిగును.