మెమొరీ పవర్ పెంచడానికి దివ్యౌషధం ‘సరస్వతి ఆకు’


అపియేసి కుటుంబానికి చెందిన సరస్వతి ఆకు శాస్త్రీయనామం సిన్టెల్లా ఏసియాటికా(Centella asiatica)(లిన్నెయస్) అర్బన్. ఇది తేమ, నీరు ఉండే ప్రాంతాలలో నేలపై పాకుతూ పెరిగే బహువార్షిక మొక్క. ప్రతికణుపు నుండి వేర్లు, ఒక్కొక్క పత్రము ఏర్పడతాయి. పత్రాలు మూత్రపిండాకారంలో ఉంటాయి. అంచులకు దంతాలవంటి నొక్కులుంటాయి. పుష్పాలు చిన్నవిగా, ఊదారంగులో ఉంటాయి. ఫలాలు తప్పడిగా ఉంటాయి. రెండుగా విడిపోతాయి. సరస్వతి ఆకు పుష్పాలు, ఫలాలు ఫిబ్రవరి-మార్చి మాసాలలో లభిస్తాయి. ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా తడి ప్రదేశాలు, పొలాల గట్ల వెంబడి పెరుగుతుంది. సంవత్సరం పొడవునా లభిస్తుంది.

సరస్వతి ఆకు ఉపయోగాలు

ఈ మొక్కను సమూలంగా వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కలో పల్లారిన్, ఏసియాటికోసైడ్, హైడ్రోకాటిలిన్, ఆస్కార్బిక్ ఆమ్లం, ఆసియాటిక్ ఆమ్లం, ఆసియాటికోసైడ్, సైటోస్టీరాల్ వంటి అనేక రసాయనాలుంటాయి. ఈ మొక్క రసాన్ని వరిబీజం, కాళ్ళవాపు, కీళ్ళవాపులు తగ్గడానికి పైన పూస్తారు. ఎండిన పత్రాల పొడిని, పాలలో కలిపి లోనికి తీసుకుంటే మానసిక వ్యాధులు నివారణ అవుతాయి. తెలివితేటలు పెరుగుతాయి. తాజా ప్రతాల రసాన్ని పాలతో తీసుకుంటే చర్మవ్యాధులు, గనేరియా, కామెర్లు, జ్వరాలు, నరాల జబ్బులు తగ్గుతాయి. పత్రాల రసాన్ని జీలకర్రతో కలిపి లోనికిస్తే పిల్లల అజీర్ణవ్యాధులు తగ్గుతాయి.

ఈ మొక్క పత్రాలు, తులసి ఆకులు, మిరియాలు సమపాళ్ళలో కలిపి తీసుకుంటే మలేరియా జ్వరం, సాధారణ జ్వరాలు నివారణ అవుతాయి. ఈ పత్రాల రసం గొంతు బొంగురును పోగొడుతుంది. ఈ పత్రాల రసానికి వస, కరక, అడ్డసరం పత్రాలు, తేనె సమపాళ్ళలో కలిపి తీసుకుంటే గొంతు బొంగురు, నరాల బలహీనత, పిచ్చి, పెప్టిక్ అల్సర్, నిస్సత్తువ వంటి మానసిక వ్యాధులు నివారణ అవుతాయి. మానసిక వైకల్యం గల పిల్లల్లో తెలివితేటలు పెంచడానికి ఉపయోగపడుతుంది. గుండెకు బలాన్నిస్తుంది. మూత్రాన్ని జారీచేస్తుంది. దేహధారుఢ్యాన్ని కలిగిస్తుంది.

మధుమేహం, దగ్గు, ప్లీహవ్యాధులు, రక్తశుద్ధి, పార్శ్వపోటు తగ్గుతాయి. ఈ మొక్క పత్రాల పొడిని నశ్యంగా పీల్చితే పార్శ్వపోటు తగ్గుతుంది. అయితే పత్రాలను నీడలో మాత్రమే ఎండించాలి. లేనట్లయితే పత్రాలలోని రసాయన పదార్ధాలు నశించి సత్ఫలితాలు రావు. పిల్లల్లో వచ్చే విరోచనాలు, దగ్గు, రొంప పత్రాల రసంతో తగ్గుతాయి. ముసలి వయస్సు రాకుండా కాపాడుతుంది. చర్మానికి రక్షణ కల్పిస్తుంది. పత్రాల రసాన్ని తేనెతో కలిపి లోనికి తీసుకుంటే మానసిక వ్యాధులు నివారణ అవుతాయి. నత్తి తగ్గుతుంది.

సరస్వతి ఆకు చూర్ణం, మిరియాల చూర్ణం సమపాళ్ళలో కలిపి అరచెంచా తేనె కూడా చేర్చి తీసుకుంటే మంచి జ్ఞాపకశక్తి కలుగుతుంది. 

సోంపు గింజలపొడి, ధనియాలను వేయించి చేసిన పొడి, యాలకుల పొడి, బాదం పప్పుల పొడి పటికబెల్లం పొడి వీటన్నింటినీ సమపాళ్ళలో కలుపుకుని రాత్రి నిద్రపోయేటప్పుడు రెండు నుంచి మూడు గ్రాముల వంతున అరగ్లాసు పాలలో కలుపుకుని నెలరోజులపాటు సేవిస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

సరస్వతి ఆకు చూర్ణం, సోంపు గింజలు, జీలకర్ర వేయించిన పొడి, పటికబెల్లం పొడి మూడింటిని సమపాళ్ళలో మిశ్రమం చేసి అరగ్లాసు పాలలో కలిపి సేవిస్తే మంచి వివేకం పెరుగుతుంది. 
గ్లాసు పాలలో ఐదు బాదంపప్పుల చూర్ణం, యాలకులచూర్ణం కలుపుకుని తాగాలి. 

ఆయుర్వేద మందుల్లో సరస్వతి ఆకు: బ్రహ్మిపాక్, బ్రహ్మిపానకం, సరస్వతారిష్టం, సరస్వతీఘృతం, బ్రహ్మీతైలం, బ్రహ్మిసత్వం, బ్రహ్మిసర్బత్, బ్రహ్మరసాయనం, పాఫనాదితైలం, పాఫనాదిఘృతం వంటి మందుల్లో సరస్వతి ఆకును వినియోగిస్తారని వైద్యలు చెబుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.