జీర్ణశక్తిని పెంపొందించే ‘సముద్రపాల’


కన్వాల్వులేసి కుటుంబానికి చెందిన సముద్రపాల శాస్త్రీయ నామం అర్జిరియా నెర్వోసా(Argyreia Nervosa)(బర్మన్ ఫిలియస్). ఇది ఇంచుమించు 15 మీటర్ల పొడవు పెరిగే బహువార్షికపు తీగ, శాఖోపశాఖలతో విస్తరిస్తుంది. మొక్క దేహమంతటా వెండి వంటి తెల్లని నూగుతో కప్పబడి ఉంటుంది. గిచ్చితే పాలు వస్తాయి. పత్రాలు కణుపుకు ఒకటి చొప్పున చాలా పెద్దవిగా హృదయాకారంలో ఉంటాయి. పత్రాల అడుగున నూగు ఉంటుంది. పుష్పాలు గంట ఆకారంలో ఎర్రగా ఉంటాయి. రక్షక పత్రావళి శాశ్వతం. ఫలాలు గుండ్రంగా ఉండి పగలవు. సముద్రపాల పుష్పాలు, ఫలాలు జూలై నుంచి డిసెంబరు మాసాలలో లభిస్తాయి. ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ లోని అన్ని అరణ్యాలలోను పెరుగుతుంది. ముఖ్యంగా సెలయేర్లు, నదుల వెంబడి పెరుగుతుంది.

సముద్రపాల ఉపయోగాలు

ఈ మొక్క వేర్లు, కాండం, పత్రాలు, విత్తనాలు వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కలో ఎర్గోలిన్, ఐసోఎర్గైన్, ఎర్గైన్ పెన్నిక్లావైన్ వంటి రసాయనాలు ఉంటాయి. ఈ మొక్క చేదుగా, జీర్ణం కానిది గాను, మలబద్ధకాన్ని తొలగించేది గాను, మూత్రాశయ, గుండె, చర్మ సంబంధిత మరియు జ్వరహరం గాను ఉపయోగపడుతుంది. కఫ, వాతాలను హరిస్తుంది. వాంతులను అరికడుతుంది. రక్తాన్ని శుభ్రం చేస్తుంది. వేరు శరీరానికి శక్తినిస్తుంది. పత్రాలు చర్మవ్యాధుల నివారణలో వాడతారు. వేరుపొడిని పాలతో కలిపి లోనికి తీసుకుంటే సిఫిలిస్ తగ్గుతుంది.

ఈ మొక్కకు జ్ఞాపకశక్తిని పెంచే గుణము ఉంది. శరీరానికి బలాన్నిస్తుంది. ముసలితనం త్వరగా రాకుండా కాపాడుతుంది. వేరుపొడిని వాడితే కీళ్ళనొప్పులు, గౌటుతగ్గుతాయి. వేరుపొడిని గంజితో కలిపి వాడితే పార్శ్వపోటు తగ్గుతుంది. వేరుపొడిని నేతితో కలిపి తీసుకుంటే నిస్సత్తువ తగ్గుతుంది. అజమోదాది చూర్ణాన్ని ఒక ప్రక్క వచ్చే పక్షవాతం, కీళ్ళనొప్పులు తగ్గడానికి వాడతారు.

ఆయుర్వేద మందుల్లో సముద్రపాల : ఈ మొక్కను కూడా ఉపయోగించి తయారుచేసిన పోర్ట్ జీ , స్పీమెన్, స్పీమెన్ పోర్ట్ అనే మందులు మగవారి లైంగిక వ్యాధుల నివారణలోను, ప్రోస్టేట్ గ్రంధుల పెరుగుదల నివారణలోను ఉపయోగిస్తారు. వర్నాది కషాయం, యోగరాజగుగ్గులు, చెరియాక్షేది తైలం, ఆయస్కృతి, బృధాదారుక సామ చూర్ణం, అజమోదాది చూర్ణం వంటి ఆయుర్వేద మందుల్లో సముద్రవపాల వినియోగిస్తారని వైద్యులు  చెబుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.