ఆయుర్వేదంలో ‘హరితమంజరి’ ఉపయోగాలు అద్భుతం


కంటికి ఎదురుగా కనిపిస్తూ పిచ్చిమొక్కలతో సమంగా పరిగణించే మొక్కలలో దివ్య ఔషధ గుణాలున్నాయంటే నమ్మశక్యం కాదు.  ఇళ్ళ పెరట్లలోను, పొలాల గట్ల వెంబడి, బీడు భూముల్లోను అత్యధికంగా కనిపించేది, తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో హరితమంజరిగా పిలిచే ఈ మొక్క అనేక వ్యాధుల చికిత్స కోసం ఉపయోగపడుతోంది. కఫం, వాతం నివారణకు, చర్మవ్యాధులు, జ్వరం, దగ్గు, మలబద్ధకం వంటి వ్యాధులను నివారించడానికి ఈ మొక్క ఉపయోగపడుతుంది. వాడుక భాషలో మురపిండ అని పిలిచే ఈ మొక్కను కుప్పంటి, కుప్పుచెట్టు అని కూడా పిలుస్తారు. 90 సెంటీమీటర్ల ఎత్తువరకూ పెరిగే ఈ మొక్క అన్ని కాలాల్లో కనిపిస్తుంది. అయితే వర్షాకాలంలో అపరిమితంగా మొలుస్తుంది.

ఈ మొక్కలో అకలైఫిన్, అకలైఫమైడ్, అరంటియమైడ్, సక్సినిమైడ్, కెంఫెరాల్ వంటి రసాయనాలు నిక్షిప్తమై ఉన్నాయి.

ఈ మొక్క ఆకులను వెల్లుల్లితో కలిపి కడుపులోకి తీసుకుంటే కడుపులోని క్రిములు నివారణ అవుతాయి. ఆకులను ఉప్పుతో కలిపి శరీరంపై చిడుము వంటి వ్యాధులు సోకినచోట పూస్తే నివారణ అవుతాయి. తామర వంటి చర్మవ్యాధులు కూడా పత్రాల గుజ్జు, సున్నపుతేటలో కలపి రాయడం వల్ల పోగొట్టవచ్చు. ఆకు రసాన్ని ఉప్పులో కలిపి ఎగ్జిమాకు మందుగా వాడవచ్చు. అలాగే వేరును నూరి కురుపులపై పూస్తే అవి తగ్గుముఖం పడతాయి.

చిన్నపిల్లలకు కఫం పడితే ఒక చెంచాడు పత్రరసాన్ని మింగిస్తే కఫం వాంతులా బైటికి పోతుంది. ఈ విధంగా ఈ మురపిండ మొక్కలోని అన్ని భాగాలు వైద్యానికి పనిచేస్తాయి. కాబట్టి ఇది మంది వనమూలిక మొక్కగా ప్రసిద్ధి. ఈ మొక్కను శాస్త్రీయంగా ఆకాలిఫా ఇండికా లిన్నెయస్ అని పిలుస్తారు. ఇది యుఫర్బియేసి కుటుంబానికి చెందిన మొక్కగా ప్రసిద్ధి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.