రేలచెట్టు ఉపయోగాలు
ఈ మొక్క యొక్క పత్రాలు, పుష్పాలు, ఫలాలు, వేర్లను వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఫలాల గుజ్జులో ఎలోవిమోడిన్, విమోడిన్, క్రైనోఫానాల్, రిహెన్, పత్రాలలో సెన్నోసైడ్ ఎ మరియు బిలు, బెరడులో ఫెస్టుకాసికన్, బార్బలోయిన్, సెన్నోసైడ్ లు ఉంటాయి. పత్రాల పేస్టును తామర ఉన్నచోట పూస్తే తగ్గుతుంది. బెరడు, పత్రాల రసాన్ని నూనెలో కలిపి పైకి వాడితే దద్దుర్లు, తామర, కుష్ఠు వ్యాధులు తగ్గుతాయి. ఫలాల గుజ్జును గౌటు,కీళ్ళ నొప్పులు ఉన్నచోట పూస్తే తగ్గుతాయి. ఫలాల పేస్టు చింతపండు గుజ్జుతో కలిపి రాత్రి సమయంలో తీసుకుంటే సుఖ విరోచనం అవుతుంది.చిన్నపిల్లల కడుపులో వాయువు పోవడానికి బొడ్డు చుట్టూ ఫలాల గుజ్జును పూస్తారు. ఫలాల కషాయాన్ని తీసుకుంటే జీర్ణాశయ రోగాలు పోతాయి. బెరడు జీర్ణశక్తిని పెంచుతుంది. జ్వరహరం, బొల్లి, ఎగ్జిమా, మధుమేహం, కీళ్ళనొప్పులు, గుండె జబ్బుల నివారణలో ఉపయోగపడుతుంది. విత్తనాలు, ఫలాల గుజ్జు కాలేయ సంబంధ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి. బెరడును కంటిచూపు కోసం వాడతారు. పత్రాల రసాన్ని పాలతో లోనికి తీసుకుంటే పిచ్చి కుక్క కాటుకు విరుగుడుగా పనిచేస్తుంది.
పుష్పాల కషాయాన్ని తీసుకుంటే అతిమూత్రవ్యాధి తగ్గుతుంది. గుల్కందను రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తీసుకుంటే సుఖ విరోచనం అవుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. అరగ్వధక్వతాన్ని లోనికి వాడితే చిడుము, తదితర చర్మ వ్యాధులు నివారణ అవుతాయి. అరోగ్బధాదిని రాత్రిపూట తీసుకుంటే సుఖ విరోచనం అవుతుంది.
ఆయుర్వేద మందుల్లో రేల : అరగ్వధకత్వం, వశిష్ఠ రసాయనం, వలియ రస్నాది కషాయం, మణిబధ్ర లేహ్యం, అరగ్వధాది లేహ్యం, అరగ్వధారిష్టం, అరగ్వధాది తైలం వంటి మందుల్లో రెల వినియోగిస్తారు.