పిల్లితీగల ఉపయోగాలు
ఈ మొక్క వేర్లు, పత్రాలు వైద్యపరంగా ఉపయోగపడతాయి. ఈ మొక్క పత్రాలలో డైసోజిన్, శతావరిన్, వేర్లలో రామ్నోస్, గ్లూకోస్, సైటోస్టీరాల్, గ్లైకోసైడ్ లు ఇతర అనేక రసాయన పదార్ధాలుంటాయి. వేరులో జిగురు ఉంటుంది. చలువను చేస్తుంది. మూత్రాన్ని జారీచేస్తుంది. నీళ్ళ విరోచనాలు, జిగట విరోచనాలను అరికడుతుంది. శక్తినిస్తుంది. లైంగికశక్తిని పెంచుతుంది. నొప్పులను నివారిస్తుంది. బాలింతలకు పాలు పడేటట్లు చేస్తుంది. అతి మూత్రాన్ని ఆపుతుంది. జ్వరాలు, స్త్రీలలో తెల్లబట్ట వ్యాధులు తగ్గిస్తుంది.జీర్ణాశయం, ప్రేగులలోని అల్సర్ లను నివారిస్తుంది. కాన్సర్ ను నివారించే గుణం ఉంది. జీర్ణాశయంలో అధికంగా స్రవించే ఆమ్లాన్ని క్రమబద్ధం చేస్తుంది. కామెర్లు, మధుమేహం, మూత్రసంబంధ వ్యాధులు, నపుంసకత్వం, కీళ్ళనొప్పులు, జ్వరాలు నివారణ అవుతాయి. వేరును నూనెలోవేసి కాచి, దానిని చర్మవ్యాధులపై రాస్తే తగ్గుతాయి. వేరును పాలలో మరిగించి, వాటిని లోనికి తీసుకుంటే అజీర్ణం, విరోచనాలు తగ్గుతాయి. ఆకలి పెరుగుతుంది. వేరును నేతిలో వేయించి, పూటకు రెండు దుంపలచొప్పున మూడురోజులు తింటే కామెర్ల వ్యాధి నివారణ అవుతుంది.
వేరు పొడిని పాలతో తీసుకుంటే చర్మవ్యాధులు నివారణ అవుతాయి. వేరును పాలతో కలిపి తీసుకుంటే మూర్ఛ తగ్గుతుంది. వేరును ఆవుపాలతో కలిపి తీసుకుంటే మూత్రపిండాలలో రాళ్ళు కరుగుతాయి. వేర్లను పాలతో కలిపి తీసుకుంటే గర్భిణీ స్త్రీలకు పాలు పడతాయి. వేరుపొడి జ్వర నివారిణిగా పనిచేస్తుంది. వేరు రసాన్ని రెండు చుక్కలు ముక్కులో వేస్తే ముక్కునుండి రక్తం కారడం ఆగుతుంది. వేరు స్త్రీలలో గర్భం ఏర్పడడానికి దోహదం చేస్తుంది. వేరును పాలలో మరిగించి, పంచదారతో కలిపి ఉదయాన్నే తింటుంటే శుక్రనష్టం తగ్గుతుంది. శతావరి ఘృతం లైంగికశక్తిని పెంచుతుంది. ఫలఘృతం శుక్రాన్ని వృద్ధిచేస్తుంది. స్త్రీల వంధత్వాన్ని నిరోధిస్తుంది. నారాయణతైలాన్ని పైనపూస్తే కీళ్ళనొప్పులు, మెడనొప్పి, పక్షవాతం, నరాలనొప్పులు పోతాయి. నరాల బాధలు పోవడానికి విష్ణుతైలాన్ని పైన పూయాలి. ప్రమేహ మిహిరతైలాన్ని ఉపయోగిస్తే గనేరియా, ఇతర మూత్రసంబంధ వ్యాధులు నిర్మూలింపబడతాయి.
ఆయుర్వేదమందులల్లో పిల్లి తీగలు : జెరిఫోర్టు అనే మందులో ఇది ఒక భాగంగా ఉంటుంది. దీనిని వాడటం వలన నిస్సత్తువ పోతుంది. ముసలితనం త్వరగా రాకుండా కాపాడుతుంది. ఇంకా శతావరి ఘృతం, ఫలఘృతం, నారాయణతైలం, విష్ణుతైలం, శతమూల్యాదిలేహ, శతావరి పానక్, శతావరిపాక, శతావరి గులం, రస్నాదికషాయం, ధాత్యాదిఘృతం మొదలైన వాటిలో పిల్లి తీగలు వినియోగిస్తారు.