ఆయుర్వేద వైద్యంలో‘రేగుచెట్టు’ ఉపయోగాలెన్నో


Ziziphus Jujuba అనే శాస్త్రీయనామం కలిగిన రెగుచెట్టును సంస్కృతములో  బదరీ, బదరము, గూఢఫలము, దృఢబీజము, వృత్తఫలము, కంటకి, వక్రకంటకము, కోల, కొలి, గృధసఖి అని కూడా పిలుస్తారు.  సౌవీరబదరము, కోలబదరము, కర్కధూబదరము అని రేగుచెట్టు మూడు రకాలు. ఈ చెట్టు అంతా ముళ్ళు ఉంటాయి. మ్రాను గట్టిగా ఉంటుంది. ఆకులు చిన్నగా, కోలగా ఉంటాయి. కాయలు, ఇండుబకాయ మొదలు, పగడపండ్ల సైజు వరకూ ఉంటాయి. పువ్వులు తెల్లగాను, గింజ పెంకు కలిగి ఉంటుంది. ఆకులు దట్టముగాను, బిరుసుగాను ఉంటాయి. వంటరిచేరిక, చెక్కతో చర్మములను తయారు చేస్తారు. కర్రతో పెట్టెలు వంటి సామాగ్రి తయారుచేస్తారు.

చిన్న రేగు: వంకరగా ఉన్న ముండ్లు కలిగిన చెట్టు. గుండ్రని పండ్లు కలిగిన చెట్టు. గట్టిదనము కలిగిన గింజలు కలిగిన చెట్టు. గంగరేగు: పెద్ద పండ్లు కలిగిన చెట్టు. గింజ చిన్నదిగా ఉంటుంది. రేగుపండు చాలా మధురముగా ఉంటుంది. ఇది చలువ చేస్తుంది. గురుత్వము కలిగినది. శరీరమునకు కండపెంచి శుక్రవృద్ధి కలిగిస్తుంది ఈ పండు. పిత్తము, తాపము, దప్పిక, రక్తహీనత పోగొడుతుంది.  కోలమను రేగుపండు వేడిచేస్తుంది. వాతము పెంచుతుంది. కఫము, పిత్తము కూడా వృద్ధిచేస్తుంది. ఇది గురుపదార్ధము.

కర్కంధూబదర అనే రేగుపండు క్షుద్రబదర ఫలమని పిలువబడుతుంది. ఇది పులుపు, వగరు, తీపి రుచులు కలిగి ఉంటుంది. వాత పిత్తములు హరిస్తుంది. ఇది గురుపదార్ధము.  రేగుపండ్లు, గింజలు తీసి ఉప్పు మిరపకాయలతో దంచి వడియాలుగా చేసి ఎండబెడతారు. అవి ఎంతో రుచిగా ఉంటాయి. రుచి పుట్టించి, పైత్య వికారాలు తగ్గించి, ఆకలి, జీర్ణశక్తి కలిగిస్తాయి. రక్తము శుభ్రపరుస్తాయి. రేగు వేరు చూర్ణము లేక కషాయము లోపలికి తీసుకుంటే అతిసారము తగ్గుతుంది. చూర్ణము పైనివేసి కట్టినచో గాయములు, పుండ్లు మానిపోతాయి. దీనివేరు కషాయము జ్వరములు, అతిసారము తగ్గుతుంది. ఆమవాతము హరిస్తుంది.

 రేగు గుణములు

ఇది చేదు, కారము రుచులు కలిగి ఉంటుంది. శీతవాతమును హరిస్తుంది. విద్రధులను, క్రిములను హరిస్తుంది. ఉష్ణవీర్యము కలిగి ఉంటుంది. రక్తదోషమును హరిస్తుంది. వీటితోపాటు ఇది పైత్యము చేస్తుంది. రేచనకారి, శ్లేష్మమును, కృచ్ఛములను, వాతమును హరిస్తుంది. అగ్నిదీపనకారి, గుల్మ, వాతరక్త, క్రిమిరోగములయందు పనిచేస్తుంది. వగరు, తీపి, చేదు, కారమును గల రుచులు గల గుణములు కలిగినది. శీర్షవాతమును హరిస్తుంది. వాతశూలలను హరిస్తుంది. అశ్మరోగములను హరిస్తుంది. రేగుచెట్టు పుష్పము గ్రాహి పైత్యమును హరిస్తుంది. ఆమవాత బలకారి. పుష్టిప్రదము. పిత్తహరము, కాసశ్వాసములు హరిస్తుంది. వాంతిని కడుతుంది, తాపశమనకారి.

రేగుతో చికిత్సలు

పూతనారోగమునకు(చంటిపిల్లల ఆసనములో జనించు వ్రణము) రేగుచెక్క కషాయముతో ఆసనములో కడుగుతూ ఉంటే శమిస్తుంది. రేగుచెక్క రసమును కంటిలో వేసినట్లయితే విషము హరిస్తుంది.  రేగుచెక్క, మునగ చెక్క కడుగుతో నూరి పట్టు వేసినట్లయితే వాతశూలలు, వాత నొప్పులు తప్పక తగ్గి తీరుతాయి. రేగు వేరు కషాయము పెట్టి అందులో వేరు కాల్చి తయారుచేసిన పొడిన కలిపి తాగితే ఆశ్మరులు తగ్గుతాయి. రేగువేరు కషాయముపెట్టి తెల్లగలిజేరు వేరును కలిపి కషాయము పెట్టి తేనెతో కలిపి తాగితే చిరకాలానుగతములగు గండమాలలు హరిస్తాయి. రేగువేరు పట్ట, తెల్లగలిజేరు వేరును కలిపి కషాయము పెట్టి త్రాగిస్తే విద్రధులను జయించవచ్చు.

రేగి ఆకు ముద్దగా నూరి వంటికి పూసినట్లయితే జ్వర తీవ్రత తగ్గుతుంది. రేగు జిగురును నాభికి రాసినట్లయితే వీర్యస్తంభమును తొలగించును. రేగి ఆకులను క్రమవృద్ధిగా రెండు మిరియాలు చేర్చి 20 రోజుల పాటు రోజూ క్రమం తప్పకుండా సేవిస్తూ ఉంటే శుక్ల నష్టము అరికట్టబడుతుంది. ఆకు నూరి కలిపి చేతితో రుద్ది తలకు రుద్దుకుంటూ ఉంటే తాపము శమిస్తుంది. రేగు మృదురేచనకారి, ఆకలిని పుట్టిస్తుంది. పైత్యమును తగ్గిస్తుంది. మూత్రమును సాఫీగా ఉంచుతుంది. పచ్చి ఆకులు లేక వేరు పట్ట, కొబ్బరిపాలు, నేతితో నూరి పట్టు వేసినట్లయితే వాతాక్రాంతవ్యధలు తగ్గుతాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.