ఆయుర్వదే వైద్యంలో ‘జిల్లేడు’ ప్రాముఖ్యం


ఆస్క్లిపియడేసి కుటుంబానికి చెందిన జిల్లేడు శాస్త్రీయనామం కెలో ట్రాపిస్ జైగాన్షియా (లిన్నెయస్)(calotropis gigantea) డ్రయాండ్.  ఇది గరిష్టంగా మూడు మీటర్ల ఎత్తు వరకూ పెరిగే బహువార్షికపు మొక్క. గిచ్చితే పాలు వస్తాయి. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. మొక్క అంతటా తెల్లటి నూగు ఉంటుంది. పత్రాలు దాదాపు అండాకారంలో ఉంటాయి.  పుష్పాలు కొమ్మల చివర గుత్తులుగా ఏర్పడతాయి. పుష్పాలు పూర్తి తెల్లగా గాని, నీలము-ఎరుపు కలిసిన రంగులోగాని ఉంటాయి. ఫలాలు జంటలుగాగాని, విడిగాగాని ఏర్పడతాయి. ఫలాలు ఒకేవైపు నిలువుగా బ్రద్దలవుతాయి. విత్తనాలకు దూది ఉంటుంది. జిల్లేడు ఫలాలు, పుష్పాలు సంవత్సరం పొడవునా ఏర్పడతాయి.  ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా కలుపుమొక్కగా పెరుగుతుంది.

జిల్లేడు ఉపయోగాలు

జిల్లేడు మొక్క పత్రాలు, పుష్పాలు, వేరు, పాలను వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కలో కెలోట్రాపిన్, అకుండారిన్, కెలాక్టిన్, కెలోట్రాక్సిన్, జైగాంటియాల్, ప్రోటియేజ్ వంటి అనేక రసాయన పదార్ధాలున్నాయి.  వైద్యపరంగా ముదిరిన మొక్క శ్రేష్ఠం. తెల్లపువ్వులు కలిగిన మొక్క శ్రేష్ఠం. దీని వేరును పాముకాటుకు విరుగుడుగా వాడతారు. దీనివేరు దగ్గరుంటే పాములు సమీపానికి రావని నమ్ముతారు.  జిల్లేడు వేరును మిరియాలతో నూరి లోనికి ఇస్తే పాము కాటుకు విరుగుడుగా పనిచేస్తుంది. పుష్పాలను మిరియాలతో కలిపి లోనికి తీసుకుంటే ఆస్థమా తగ్గుతుంది. పిప్పిపన్ను పోటు పోవాలంటే,దీని పాలను ఒక చుక్క, ప్రక్కవాటికి తగలకుండా గలకలో వేస్తే నివారణ అవుతుంది.

జిల్లేడు వేరు పేస్టును బోదకాలు నివారణకు పైపూతగా వేస్తారు. ఈ మొక్క నుండి తయారుచేసిన అర్కతైలాన్ని చర్మవ్యాధుల నివారణకు, తేలు, జెర్రి కాటుకు విరుగుడుగా పైన పూస్తారు. పుష్పాలకు లైంగికశక్తిని పెంచే గుణముంది. పెరిగిన ప్లీహం, కాలేయం, గ్రంధులను నివారిస్తుంది. మూలశంఖ, క్రిములు, అజీర్ణం వంటి వాటిలో పనిచేస్తుంది. కొద్దిగా వేడిచేసిన పత్రాలను వాపులు, కీళ్ళనొప్పులున్న ప్రాంతాలపై ఉంచితే అవి నయమౌతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది. కఫాన్ని వెడలగొడుతుంది. పత్రాలను జిల్లేడు పాలతో మర్దించి, చిన్న మాత్రలుగా చేసుకుని అరగంటకు ఒకసారి ఒక మాత్ర లోనికి ఇస్తుంటే పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుంది.

జిల్లేడు పాలను నెయ్యి, నువ్వులనూనెతో కలిపి పైన పూస్తే పిచ్చికుక్క వల్ల పడిన గాయం తగ్గుతుంది. విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. వేరు బెరడుపొడిని తేనెతో కలిపి తీసుకుంటే పిల్లల్లో కోరింత దగ్గు తగ్గుతుంది. ప్రేగులలోని క్రిములు పోతాయి. తెల్లజిల్లేడు పువ్వులను బెల్లంతో కలిపి నూరి ఇస్తే స్త్రీలలో ఆగిపోయిన బహిష్టు తిరిగి ప్రారంభమవుతుంది.

ఆయుర్వేద మందులల్లో  జిల్లేడు : అర్కతైలం, అర్కేశ్వర్, అర్కలవన్, అర్కేశ్వరవటి, కచ్చోరాది తైలం, ధన్వంతరంఘృతం, వజ్రకతైలం, నగరాదితైలం, అవిల్ తోలాది భస్మం మొదలైన మందుల్లో జిల్లేడును వినియోగిస్తారని వైద్యలు చెబుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.