
మారేడు చెట్టును దేవాలయాలలో కూడా ఎక్కువగా పెంచుతారు ముఖ్యంగా శివాలయాల్లో... మారేడు పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. శివుని పూజించేసమయంలో ఒక్క మారేడుదళాన్ని ఆయనకు సమర్పిస్తే చాలు, భోళా శంకరుడు మనలను కరుణించి కోరిన వరాలు ప్రసాదిస్తాడు. అంతటి మహిమాన్వితమైనది మారేడు. మారేడు కాయలు కూడా ఆయుర్వేద వైద్యంలోను, ఆధ్యాత్మికంగానూ చాలా ప్రాధాన్యతను సతరించుకున్నాయి. వినాయకచవితి నాడు మారేడు కాయలు పాలవెల్లికి కట్టకుండా పూజ చేయము
మారేడు ఉపయోగాలు
ఈ మొక్క వేర్లు, బెరడు, పత్రాలు, ఫలాలను వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఇది దశమూలలకు చెందుతుంది. ఈ మొక్క ఫలాలలో మార్మలోసిన్, మార్మిన్, ఏగిల్ నైన్, రూటిన్, మార్మిసినైన్, కాండం బెరడులో కుమారిన్, అంబెల్లిఫెరోన్ వంటి రసాయనాలు, ఫలాలలో విటమిన్లు, కెరోటిన్ లు కూడా ఉంటాయి. వేరు వాతహరం, జీర్ణశక్తిని పెంచుతుంది. విరోచనాలు, జ్వరాలు నివారింపబడతాయి. ఫలాలకు చక్కెర వ్యాధిని నివారించే గుణం ఉంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బలాన్నిస్తుంది. నీళ్ళవిరోచనాలు, జిగట విరోచనాలు, మూత్రం చుక్కలుగా పడడం, జ్వరాలు, కడుపునొప్పి, శూల, వాంతుల నివారణలో ఉపయోగపడతాయి.
గుండెజబ్బులు, బ్రాంఖైటిస్, కాలేయ వ్యాధులు, నీర్సం, మూలశంఖ, శుక్రనష్టం, శరీరానికి చలువచేయడంలోను ఉపయోగపడుతుంది. వేర్లను ఆకలిని పుట్టించడానికి, పత్రాలు కఫాన్ని వెడలగొట్టడానికి, ఆస్థమా, బెరడును జ్వరం, మానసిక వ్యాధులు, గుండెజబ్బుల నివారణలో ఉపయోగిస్తారు. ఎండిన మారేడు ఫలం గుజ్జు, వక్క, దానిమ్మ బెరడుల పొడిని నీళ్ళవిరోచనాలు, జిగట విరోచనాలు తగ్గడానికి వాడతారు. ఫలాలపై పెచ్చు కషాయానికి తేనె కలిపి లోనికి
తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. వేరుబెరడు త్రిదోషహారం, కడుపునొప్పి, గుండెదడ తగ్గుతాయి.

పత్రాల రసాన్ని చర్మంపై పూస్తే గాయాలు తగ్గుతాయి. పత్రాలను కాల్చి ఆ నుసిని గాయాలు మానడానికి వాడతారు. వేర్లను ఏడు మిరియాలతో కలిపి నూరి లోనికి తీసుకుంటే పాముకాటుకి విరుగుడుగా పనిచేస్తుంది. ఫలంగుజ్జును పంచదారతో కలుపుకుని తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. పత్రాల కషాయాన్ని రోజుకు రెండుసార్లు తీసుకుంటే మధుమేహం తగ్గుతుంది. వేరు కషాయాన్ని పాలతో తీసుకుంటే జ్వరాలు నివారణ అవుతాయి. మూలశంఖ నివారణ అవుతుంది. పచ్చి ఫలం కషాయాన్ని, అల్లం, బార్లీపొడితో కలిపి తీసుకుంటే వేవిళ్ళు తగ్గుతాయి. మారేడు చిగుళ్ళను నూరి బెల్లంతో కలిపి తీసుకుంటే నీళ్ళ విరోచనాలు తగ్గుతాయి. పండిన ఫలం పొడిని నీటితో తీసుకుంటే రక్త విరోచనాలు తగ్గుతాయి. ఫలం పొడిని మజ్జిగతో లోనికి తీసుకుంటే రక్తమొలలు తగ్గుతాయి. అతిసార నాశక చూర్ణాన్ని విరోచనాలు తగ్గించడానికి వాడతారు.
ఆయుర్వేద మందులల్లో మారేడు : బిల్వ పంచకక్వతం, బిల్వాది చూర్ణం, బిల్వాదిఘృతం, బిల్వతైలం, బిల్వమూలాది గుటిక, దశమూలారిష్టం, ధన్యపంచకక్వతం, లఘు గంగాధరచూర్ణం, వస్యకాదిక్వతం, బిల్వాది లేపం, అమృతారిష్టం, అసన బిల్వాదితైలం, ఇత్యాది ఆయుర్వేద మందుల్లో మారేడును వినియోగిస్తారు.
ఆయుర్వేద మందులల్లో మారేడు : బిల్వ పంచకక్వతం, బిల్వాది చూర్ణం, బిల్వాదిఘృతం, బిల్వతైలం, బిల్వమూలాది గుటిక, దశమూలారిష్టం, ధన్యపంచకక్వతం, లఘు గంగాధరచూర్ణం, వస్యకాదిక్వతం, బిల్వాది లేపం, అమృతారిష్టం, అసన బిల్వాదితైలం, ఇత్యాది ఆయుర్వేద మందుల్లో మారేడును వినియోగిస్తారు.