సెలాస్ట్రేసి కుటుంబానికి చెందిన మాల్కంగిణి శాస్త్రీయనామం సెలాస్ట్రస్ పానిక్యులాటస్(Celastrus Paniculatus) విల్డినో. ముండ్లు లేనటువంటి పెద్ద బహువార్షికపు పొద. కొమ్మలు 4 నుంచి 5 మీటర్ల పొడవు పెరిగి వ్రేళాడుతూ ఉంటాయి. పత్రాలు కణుపుకు ఒకటి చొప్పున ఏర్పడి, అండాకారంలో ఉంటాయి. అంచులకు నొక్కులుంటాయి. పుష్పాలు లేత ఆకుపచ్చగా పొడవైన గుత్తులుగా కొమ్మల చివర ఏర్పడతాయి. ఫలాలుగుండ్రంగా ఉంటాయి. పండినప్పుడు పసుపు రంగు ఉండి మూడు భాగాలుగా బద్దలవుతాయి. విత్తనాలు కమలాఫలం రంగు వంటి గుజ్జుతో కప్పబడి ఉంటాయి. పుష్పాలు సంవత్సరం పొడవునా, ఫలాలు ఆగస్టు- సెప్టెంబరు మాసాలలో లభిస్తాయి. ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ లోని అన్ని అరణ్యాలలోను పెరుగుతుంది.
మాల్కంగిణి ఉపయోగాలు
ఈ మొక్క పత్రాలు, విత్తనాలు, నూనెను వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్క విత్తనాలలో సిలాస్ట్రైన్, మాల్కంగునిన్, సిలాపనైన్, సిలాస్ట్రాల్, పానికలటైన్, పామిటిన్, స్టియారిక, ఫార్మిక, ఎసిటిక్, బెంజాయిక్ ఆమ్లాలు వంటి రసాయన పదార్ధాలుంటాయి. జ్ఞాపకశక్తిని, తెలివితేటలను పెంచుతుంది. జీర్ణరసాలను స్రవింపచేస్తుంది. దీని నూనెను దోమలు దగ్గరకు రాకుండా గిరిజనులు ఒంటికి పూసుకుంటారు. నూనెను లవంగాలు, జాజికాయ, జాపత్రితో కలిపి తీసుకుంటే బెరి-బెరి వ్యాధి నివారణ అవుతుంది. విత్తనాల కషాయాన్ని తీసుకుంటే కీళ్ళనొప్పులు, పక్షవాతం, కుష్ఠు, గౌటు వ్యాధులను