
బూరుగు ఉపయోగాలు
ఈ మొక్క జిగురు, బెరడు, వేరు, పత్రాలు వైద్యపరంగా ఉపయోగపడతాయి. ఈ మొక్కలో బీటా-సైటోస్టీరాల్, గ్లైకొసైడ్, హెంట్రియాకాంటీన్, హిక్సాకొసనాల్, టోకోఫెరాల్ వంటి అనేక రసాయనాలు ఉన్నాయి. ఈ మొక్క నుంచి తయారుచేసిన శల్మాలి చూర్ణాన్ని గాయాలు, కురుపులపైన వేస్తే త్వరగా మానుతాయి. జిగురు నీళ్ళ విరేచనాలు, జిగట విరేచనాలు, తెల్లబట్ట తగ్గడానికి ఉపయోగపడుతుంది. పత్రాల రసం చర్మవ్యాధులను నివారిస్తుంది. లేత పుష్పాలను ఎండబెట్టి చూర్ణాన్ని చేసి లోనికి తీసుకుంటే మూత్రపిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి. వేర్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి, మూత్రాన్ని జారీచేస్తాయి. లైంగికశక్తిని పెంచుతాయి. ముండ్లను పాలతో నూరి మొటిమలపై పూస్తే అవి పోతాయి. ముఖానికి వర్ఛస్సు పెరుగుతుంది.
కఫాన్ని పెంచుతుంది. మశూచి, చిగుళ్ళ నుంచి రక్తస్రావం, పంటిపోటు, నోటిలో పుండ్లు మొదలైనవి తగ్గుతాయి. శుక్రనష్టాన్ని నివారిస్తుంది. బెరడు పేస్టును చర్మవ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు. పత్రాలను నీటితో నూరి వాపులపై పూస్తే అవి తగ్గుతాయి. వేరు కషాయాన్ని వాడితే మూత్ర సంబంధ వ్యాధులు నివారణ అవుతాయి. జిగురు విరోచనాలను తగ్గిస్తుంది. జిగురును పటికబెల్లంతో కలిపి తీసుకుంటే విరోచనాలు కడతాయి. లేత పుష్పాలను నెయ్యిలో వేయించి, సమపాళ్ళలో పంచదారను కలుపుకుని ఉదయం తీసుకుంటే స్త్రీలలో తెల్లబట్ట తగ్గుతుంది.