నొప్పులను హరించే అడ్డసరము


అకాన్థేసి కుటుంబానికి చెందిన అడ్డసరము శాస్త్రీయనామం అడతోడా జైలానికా మెడికస్.  ఇది ఒకటి నుంచి నాలుగు మీటర్ల ఎత్తు వరకూ పెరిగే బహువార్షిక మొక్క. విస్తృతంగా శాఖలు ఏర్పడతాయి. సతతహరిత మొక్క. పత్రాలు సరళం. కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. అండాకారంలో గాని, కుంభకటకాకారంలో గాని ఉంటాయి. వృంతాలు పొట్టిగా ఉంటాయి. పైభాగంలో ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. పుష్పాలు గ్రీవాలలో ఏర్పడతాయి. పుష్పాలు తెల్లగా, ఆకుపచ్చని పుష్ప పుచ్ఛాలతో కంకులపై ఏర్పడతాయి. ఫలం, గుళిక, నిలువుగా బద్దలవుతుంది.  అక్టోబరు నుంచి మార్చి మాసాలలో పుష్పాలను, ఫలాలను ఇస్తుంది

లభించే ప్రదేశాలు

ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా పంటపొలాలు, నివాసస్థలాలు, ఉద్యానవనాలలోను కంచె బదులుగా పెంచబడుతుంది.  దీనివేర్లు, పత్రాలు, పుష్పాలను వైద్యపరంగా ఉపయోగిస్తారు.  పత్రాలలో వాసిసైన్, వాసిసినోన్, ఎఫెడ్రైన్, వసాకిన్ వంటి రసాయనాలున్నాయి.

ఉపయోగాలు

శరీరతత్వాన్ని మారుస్తుంది. నొప్పులను తగ్గిస్తుంది. కీళ్ళనొప్పులు, శ్వాశ వ్యాధులు, మూత్రవ్యాధులు, కఫనివారణలోను, మలబద్ధక నివారణలోను, నరాలనొప్పులు, నిద్రలేమి, ఆస్థమా, బ్రాంఖైటిస్, ఛాతీనొప్పి, దగ్గు, కుష్ఠు, కళ్ళవ్యాధులు, చర్మవ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి. ప్రసిద్ధిచెందిన గ్లైకోడిన్ దగ్గు మందులో ఇది ఉంటుంది. నిస్సత్తువను తగ్గించడానికి వాడే ‘జెరిపోర్టు’ మందులో మందులో ఇది ఒక భాగం. తాజా పత్రాల రసాన్ని తేనెతోగాని, అల్లపురసంతో గాని లోనికి తీసుకుంటే దగ్గు, బ్రాంఖైటిస్, ఆస్థమా, కంఠంలో దురద తగ్గుతాయి. కఫం పలుచబడి బయటకు పోతుంది.
పత్రాలను చితకగొట్టి దానిని వాపులు, నరాల నొప్పులు, కీళ్ళనొప్పులున్న భాగాలపై పూస్తే అవి తగ్గుతాయి. చిడుము, తదితర చర్మ వ్యాధులు నివారింపబడతాయి. ఎండిన పత్రాల పొడిన మలేరియా జ్వర నివారణలో వాడతారు. ఎండిన పత్రాలను చుట్టలుగా ఉపయోగించి ఆ పొగను త్రాగితే ఆస్థమా తగ్గుతుంది. పుష్పాలను కళ్ళ జబ్బుల నివారణలో ఉపయోగిస్తారు.

పత్రాల రసాన్ని, వెలగపత్రాల రసాన్ని కలిపి ముక్కులో రెండు చుక్కలు పోస్తే ముక్కునుండి రక్తం కారడం తగ్గుతుంది. తాజా పత్రాల రసాన్ని జలుబు, జ్వరం, కామెర్లు, కోరింతదగ్గు, న్యుమోనియా, కఫంలో రక్తం పడడం వంటి వాటి నివారణలో వాడతారు. పత్రాల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. అడ్డసరం పత్రాలు, పుష్పాల కషాయాన్ని తేనె, పంచదారతో కలిపి లోనికి తీసుకుంటే పిత్త సంబంధ జ్వరాలు తగ్గుతాయి. అడ్డసరం పత్రాలు, నల్లద్రాక్ష, కరక్కాయల పొడిని పంచదార, తేనెతో కలిపి లోనికి తీసుకుంటే రక్తస్రావం ఆగుతుంది. ఆస్థమా నివారణ అవుతుంది. అడ్డసరం పత్రాల రసాన్ని అతిమధురంతో కలిపి వాడితే గవదబిళ్ళలు తగ్గుతాయి. అడ్డసరం పత్రాల రసాన్ని వాడితే మూలశంఖ నయమవుతుంది.  వసావ లేహ్యాన్ని లోనికి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. కనకాసవాన్ని వాడితే దీర్ఘకాలిక దగ్గు, కఫం, బ్రాంఖైటిస్ వంటివి నివారణ అవుతాయి. వసచందనాది తైలాన్ని ఛాతీపై మర్దనా చేస్తే శరీర క్షీణత తగ్గుతుంది. తలపై మర్దనా చేస్తే మూర్ఛ, పిచ్చి, హిస్టీరియా వ్యాధులు నయమవుతాయి.

తయారయ్యే ఆయుర్వేద మందులు: వసాక చూర్ణం, వసాకక్వతం, వసాకారిష్టం, వాసాకాఘృతం, వాసాకా లేహ్యం, వసచందనాదితైలం, ఫాలాత్రికాదిక్వతం, వాసాదిక్వతం, కనకాసవం, పూనింమాది క్వతం, వలినరస్నాది కషాయం, చ్యవనప్రాస లేహ్యం వంటి ముందుల్లో అడ్డసరం మొక్కను వినియోగిస్తారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.