శరీర కణాలకు శక్తినిచ్చ అటుకమామిడి


నిక్టాజినేసి కుటుంబానికి చెందిన అటుకమామిడి శాస్త్రీయనామం బోరిహేవియా డిప్యూసా లిన్నెయస్. ఇది రెండు నుంచి నాలుగు మీటర్ల పొడవు పెరిగే, నేలబారున విస్తరించే బహువార్షికమొక్క. ఈ మొక్కకు దుంపవంటి తల్లివేరు ఉంటుంది. శాఖలు ఎర్రగా ఉంటాయి. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. దాదాపు గుండ్రంగా ఉంటాయి. పత్రాల పైభాగం ఆకుపచ్చగాను, కిందిభాగం తెలుపుగాను ఉంటుంది. పుష్పాలు చిన్నవిగా, ఎరుపురంగులో ఉంటాయి. ఫలాలు కొలదిగా ఉంటాయి. ఫలాలపై జిగురువంటి పదార్ధం గల గ్రంధులు ఉంటాయి.  పుష్పాలు, ఫలాలు దాదాపు సంవత్సరం పొడవునా ఏర్పడతాయి.

లభించే ప్రదేశాలు

ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కలుపుమొక్కగా గోడలపై, ఇసుకనేలలలో పెరుగుతుంది. మొక్క సాధారణంగా వాంతులను కలిగిస్తుంది. కడుపులోని క్రిములను నివారిస్తుంది. మూత్రాన్ని జారీచేస్తుంది. కఫాన్ని వెడలగొడుతుంది. ఈ మొక్క శరీరంలోని అన్ని కణాలకు శక్తినిస్తుంది. నొప్పులను తగ్గిస్తుంది. శరీరానికి చలువచేస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది. గుండె, మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. కామెర్లు, మధుమేహం, శరీరానికి నీరుపట్టడం, నిస్సత్తువ తగ్గుతాయి.

వేరు కళ్ళవ్యాధులు, స్త్రీల తెల్లబట్ట, ఎలుకకాటుకు విరుగుడుగాను, ఆస్థమా, మలబద్ధకం, దగ్గు, పడిశం మొదలగువాటిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
మొక్క కషాయాన్ని 1-4 చెంచాలు తీసుకుంటే శరీరం ఉబ్బు తగ్గుతుంది. వేరు, పత్రాల రసం కామెర్లను తగ్గిస్తాయి. నిద్రలేమిని పోగొడుతుంది. వేరు, పత్రాల చూర్ణం లోనికి తీసుకుంటే రేచీకటి పోతుంది. మొక్క చూర్ణాన్ని ఆవనూనెలో కలిపి పైన పూస్తే గజ్జి, చిడుము, ఎగ్జిమా వంటి చర్మవ్యాధులు నివారింపబడతాయి. వేరుపొడిని, పాలతో కలిపి తీసుకుంటే నిస్సత్తువ పోతుంది. పత్రాల రసాన్ని తీసుకుంటే గనేరియా నివారణ అవుతుంది. ‘బిలియారిన్’ అనేమందు కాలేయ వ్యాధులను నివారిస్తుంది. స్టిప్లోన్ అనే మందు పిల్లలలో పెరుగుదలను ప్రోత్సహించడానికి, టాన్సిల్స్ ఆపరేషన్ తర్వాత అధిక రక్తస్రావం ఆపడంలో పనిచేస్తుంది.

ఆయుర్వేద మందులు : పునర్నవాష్టకం, పునర్నవాసవం, పునర్నవాంబు, పునర్నవ మండూరం, రసనసప్తకక్వతం, పునర్నవాదిక్వతం, కుమారి ఆసవం, చ్యవనప్రాశ వంటి ఆయుర్వేద మందులు దీనితో తయారుచేస్తారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.