తేమ, బురద ఉండే ప్రదేశాలలో పెరిగే బహువార్షిక మొక్క. ఈ మొక్క అన్ని భాగాలకు మంచి సువాసన ఉంటుంది. పత్రాలు దళసరిగా, ఏకాంతరంగా, రెండు వరుసలలో అమరి ఉంటాయి. పత్రాలు 80 నుంచి 120 సెంటీమీటర్లు పొడవుంటాయి. పత్రాలు సన్నగా, బాకు ఆకారంలో ఉంటాయి. బురద నేలలో దుంపవేరు ఉంటుంది. దీనినే వసకొమ్ము అంటారు. పుష్పాలు లేత ఆకుపచ్చరంగులో ఉండి, సువాసనతో ఉంటాయి. పుష్పాలు ఒక దొప్పలో ఇమిడి ఉంటాయి. ఫలాలు పసుపురంగులో ఉంటాయి.
వస మొక్క పుష్పాలు, ఫలాలు ఫిబ్రవరి మాసంలో ఏర్పడతాయి. ఇది తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని గిరిజనులచే పెంచబడుతుంది. మనదేశంలో ముఖ్యంగా హిమాలయ ప్తాంతంలో సహజసిద్ధంగా పెరుగుతుంది. వస మొక్క దీని వేరును వైద్యపరంగా ఉపయోగిస్తారు. వేరులో ఎకోరిన్, కెలామిన్, కెలామినాల్, ఎకోరడిన్, ఆగ్జాలిక్ ఆమ్లం వంటి రసాయనాలు ఉంటాయి.
వస ఉపయోగాలు
తెలివితేటలను పెంచుతుంది. జాపకశక్తిని వృద్ధిచేస్తుంది. బ్రాంఖియల్ ఆస్థమా, కేన్సర్, రక్తనాళాలలో కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. గొంతును శుభ్రపరుస్తుంది. విరోచనాలు, కడుపునొప్పి, శూల, చిన్న పిల్లల్లో జ్వరాలు, దగ్గు, పిచ్చి, కీళ్ళనొప్పులు తగ్గుతాయి. కడుపులోని క్రిములు నివారించబడతాయి. లైంగికశక్తిని పెంచుతుంది. మూత్రాన్ని సాఫీగా జారీచేస్తుంది. కఫాన్ని పోగొడుతుంది. నరాలకు శక్తినిస్తుంది. నిద్రను కలిగిస్తుంది. మూత్రపిండాలలోని రాళ్ళను కరిగిస్తుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది. మూర్ఛ, కడుపులో వాయువు, హిస్టీరియా, మూలశంఖ, పళ్ళవ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.దీనినుంచి తయారుచేసిన ‘విటాఫిక్స్’అనే ఆయుర్వేద మందు శీఘ్రస్కలనాన్ని ఆపుతుంది. దీనినుంచి తయారుకాబడే ‘మయోస్టాల్’ అనే మందును బాలింతలకు వచ్చే వ్యాధుల నివారణలో వాడతారు. దీనికొమ్మును గంజాయి మరియు సోపుతో సమపాళ్ళలో కలిపి ధూపంవేసి, ఆ ధూపాన్ని మూలశంఖకు పట్టిస్తే పిలకలు రాలిపోతాయి. దీనినుండి తయారుచేసిన ‘చంద్రోదయవర్తి’ ని కళ్ళ మసకలు పోవడానికి వాడతారు.
వస చూర్ణాన్ని ప్రతిరోజూ లోనికి తీసుకుంటే పెరిగిన గ్రంధులు కరుగుతాయి. చిటికెడు వస చూర్ణాన్ని తేనెలో కలిపి రెండుపూటలా తీసుకుంటే మూర్ఛతగ్గుతుంది. అన్ని మాసనికవ్యాధులు నివారణ అవుతాయి. చంటిపిల్లలకు కొద్ది వసకొమ్మును అరగదీసి నాలుకపై పూస్తుంటే మాటలు త్వరగా వస్తాయి.
గొంతు బొంగురు పోవడానికి వస చూర్ణాన్ని, వేడిపాలలో కలుపుకుని త్రాగాలి. దగ్గు, గొంతులో దురద తగ్గాలంటే చిన్న వసకొమ్మును నోటిలో వేసుకుని చప్పరిస్తూండాలి. వస చూర్ణాన్ని తగుమాత్రం మిరియాల పొడిని, పెరుగులో కలుపుకుని నిత్యం వాడుతుంటే హిస్టీరియా తగ్గుతుంది. పచ్చికొమ్ము రసం మలేరియా జ్వరాన్ని నివారిస్తుంది.
సరస్వతి చూర్ణం, మేధ్యరసాయనం, సుదర్శన చూర్ణం, వసయోగ, సంజీవని వటి, దేవదార వటిక్వతం, కరంజాది యోగ, యోగరాజగుగ్గులు, లఘువిషగర్వతైలం, కుకువాది చూర్ణం, చంద్రప్రభవటి, వచాదితైలం, వలియరసాది కషాయం వంటి ఆయుర్వేద మందుల్లో వస వినియోగిస్తారు.