దీని గుణములు
పది మొదలు ఇరవై చుక్కల వరకూ నీటిలోవేసి దీని చమురు లోనికి పుచ్చుకున్నట్లయితే ఒక ఔన్సు ఆముదము పుచ్చుకున్నదానికి సమానము. కావున దీనిని చాల తక్కువగాను, అతిజాగ్రత్తగాను వాడవలసి ఉంటుంది. ఈ చమురు దురదలు, గజ్జి, చిడుము, ఏనుగుగజ్జి, మొలగజ్జి, తామర పోగొడుతుంది. కురుపులు, గాయములు, పుండ్లు త్వరగా మాన్పివేస్తుంది.వినియోగం ఇలా...
దీని ఆకులు నిప్పులమీద వెచ్చజేసి స్తనములమాద వేసి కట్టి కొంచెం సేపు ఉంచినచో చనుబాలు వృద్ధి అవుతాయి. దీని ఆకులకు ఆముదము రాసి నిప్పులమీద వెచ్చచేసి వాటితో రుద్దినచో ప్రమేహపిటకలు, విద్రధులుపోతాయి. దీని కాడలనుంచి వచ్చే జిగురైన ద్రవము పూసినచో గాయములు, వ్రణములు, నరుకులు మొదలైనవాటి నుంచి స్రవించే రక్తము వెంటనే నిలిచిపోతుంది.అంతేకాక ఇది గజ్జి, చిడుము,తామర వంటి చర్మవ్యాధులకు మిక్కిలి మంచిమందు. దీని వేరుపట్ట ఆమవాతము పోగొడుతుంది. ఈ పట్టను కొంచెం ఇంగువ కలిపి నూరి లోపలికి మజ్జిగతో పాటు పుచ్చుకుంటే అగ్నిమాంద్యము తగ్గుతుంది. అతిసారములను కడుతుంది. అప్పటికప్పుడు కోసిన దీని కాడలతో పళ్ళుతోముకున్నట్లయితే చిగుళ్ళు గట్టిపడతాయి. నోటి దుర్వాసన పోతుంది. పండ్లనుండి రక్తము స్రవించడం కడుతుంది. దంతములు గట్టిపడి ఎప్పుడు ఊడకుండా ఉంటాయి.