వాత పిత్త ప్రకోప వ్యాధుల నిర్మూలనకు గురువింద కీలకం

ఫాబేసి కుటుంబానికి చెందిన గురువింద అబ్రస్ ప్రికటోరియస్(Abrus precatorius) లిన్నెయస్ అనే శాస్త్రీయనామం కలిగినది. ఇతర మొక్కలను చుట్టుకుని పెరిగే బహువార్షికపు తీగ. పత్రాలు 10-20 జతలుగా కలిసి ఉంటాయి. పత్రాలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. పుష్పాలు చిన్నవిగా ఉండి , అక్షంపై ఉబ్బిన కణుపుల నుండి గుత్తులు గుత్తులుగా వస్తాయి. పుష్పాలు గులాబి రంగులో ఉంటాయి. ఆకర్షణ పత్రావళి చిక్కుడు పుష్పాలను పోలి ఉంటుంది. ఫలాలు చిన్నవిగా ఉండి, అడ్డుగోడలను కలిగి ఉంటాయి.

విత్తనాలు ఇంచుమించు అండాకారంలో ఉంటాయి. సాధారణంగా ఎర్రగా ఉండి ఒక చివర నల్లని మచ్చని కలిగి ఉంటాయి. పూర్తి తెలుపు, పూర్తి నలుపు రంగును కలిగిన విత్తనాలు కూడా అరుదుగా లభిస్తాయి.  గురవింద పుష్పాలు ఫలాలు  అక్టోబరు నుంచి ఫిబ్రవరి మాసాలలో మనకు లభిస్తాయి. ఇది ఆంధ్రప్రదేశ్ లోని అన్ని అరణ్యాలలోనూ, మిగిలిన ప్రాంతాలలో తుప్పలు, కంచెల వెంబడి పెరుగుతుంది.

గురవింద ఉపయోగాలు

గురవింద మొక్క ప్రతాలు, వేర్లు, విత్తనాలను వైద్యపరంగా ఉపయోగిస్తారు.  ఈ మొక్క పత్రాలలో గ్లైసిరైజిన్, విత్తనాలలో ఆబ్రిన్- ఎ, బి, సి, అబ్రాసిన్, ప్రికాసిన్, అబ్రాలిన్ వంటి అనేక రసాయన పదార్ధాలు ఉన్నాయి. విత్తనాలలో ఉండే ఏబ్రిన్ అనే ఆల్కలాయిడ్ విషతుల్యం.  గురవింద మొక్క పత్రాలు, వేర్లు, విత్తనాలను ఆయుర్వేదపరంగా వాత, పిత్త ప్రకోపాల వల్ల జనించే వ్యాధుల నిర్మూలనలో వాడతారు. విత్తనాలు చేదుగా ఉంటాయి. ఉష్ణాన్ని కలుగచేస్తాయి. శ్వాసకోశ వ్యాధుల నిర్మూలనలోను, లైంగికశక్తిని వృద్ధిచేయడం లోనూ, శరీరానికి శక్తినివ్వడానికి, ప్రేగులలోని క్రిములను నివారించడంలోను ఉపయోగపడతాయి. కేశ వృద్ధికి, జ్వర నివారణలోనూ, తలతిరగడం, దాహం, కంటిజబ్బుల నివారణలోనూ ఉపయోగిస్తారు.

చర్మవ్యాధులు, పేనుకొరుకుడు, అల్సర్లు, ఆస్థమా వంటి వ్యాధుల నివారణలోను వాడతారు. విత్తనాలకు గర్భనిరోధక శక్తి ఉంది. విత్తనాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ లోనికి తీసుకోకూడదు. స్త్రీలలో గర్భం రాకుండా ఉండాలంటే ఈ విధంగా చేయాలి. ఒక సంవత్సరం వరకు గర్భం రాకుండా నిలుపుచేయాలంటే ఒక గురివింద గింజను తీసుకుని కొద్ది బెల్లం మధ్యలో గింజను ఉంచి రుతుస్రావం తరువాత లోనికి మింగితే గర్భం ఒక సంవత్సరం వరకు రాదు. రెండు సంవత్సరాల వరకు రాకుండా ఉండాలంటే రెండు గింజలు మింగాలి. మూడు గింజలు మింగితే ప్రాణహాని జరుగుతుంది. తెల్ల గురివింద శ్రేష్ఠం.

కముకు గాయాల వల్ల వాచిన భాగాలపై తాజా ఆకుల రసాన్ని కొబ్బరినూనెలో కలిపి పైన పూస్తే నొప్పి నొప్పి, వాపులు తగ్గుతాయి. పత్రాల రసాన్ని, చిత్రమూలం వేరును కలిపి నూరి బొల్లి మచ్చలపై పూస్తుంటే బొల్లి తగ్గుతుంది. (పెదవులపై పూయకూడదు) పక్షవాతం, తుంటినరం నొప్పి, పట్టివేసిన కీళ్ళ బాధల నుండి బయటపడడానికి విత్తనాలను నీటిలో అరగదీసి, ఆ పేస్టును పైన పూయాలి. పత్రాల కషాయాన్ని దగ్గు, పడిశం, కడుపునొప్పి తగ్గడానికి లోనికి తీసుకోవాలి. చర్మంపై వచ్చే దద్దుర్లు, చిడుము పోవాలంటే పత్రాల రసాన్ని చిత్రమూలం వేరుతో నూరి పైన పూయాలి.

వేర్లను గనేరియా, కామెర్లు, రేచీకటి, చిగుళ్ళవాపు, కండరాల నొప్పులు, మూత్రం మడ్డిగా పోవటం, విరిగిన ఎముకలు అతుక్కోవటంలో సహాయ పడటానికి వాడతారు. తాజా పత్రాల రసాన్ని రెండు మిరియాలు, కొద్ది పంచదారతో కలిపి చప్పరిస్తే గొంతు బొంగురు, గొంతునొప్పి, గొంతువాపు తగ్గుతాయి. పత్రాల రసాన్ని, చిత్రమూలం వేరుతో నూరి పేను కొరుకుడు ప్రాంతంలో పూస్తే వెంట్రుకలు మొలుస్తాయి.

వైద్యపరంగా శుద్ధిచేయబడిన విత్తనాలు శరీరానికి శక్తినివ్వడానికి, లైంగికశక్తిని ఇవ్వడానికి వాడతారు. ఎండిన పత్రాల పౌడర్ ను లోనికి తీసుకుంటే శరీరంలో అమిత వేడి తగ్గుతుంది. గింజలను నూరి, ఆ పేస్టునుబట్టతల ఉన్న ప్రదేశంలో పూస్తే జుత్తు వస్తుంది. (వంశపారంపర్యంగా వచ్చే బట్టతలకు పనిచేయదు)
వేరును పాలతో వండి దీనిని తింటే మూత్రంలో శుక్రం పోవడం ఆగుతుంది. పత్రాలను నూరి కీళ్ళనొప్పులు ఉన్న భాగంలో కడితే నొప్పులు తగ్గుతాయి. తాజావేరు రసాన్ని గర్భస్రావం కావడానికి వాడతారు.

గుంజబధ్రరసం, గుంజతైలం, గుంజాదిలేపం, గోరోచనాది గుళిక, నీలి బృంగాదితైలం, శ్వేత గుంజాది గుళిక వంటి ఆయుర్వేద మందుల్లో గురవింద వినియోగిస్తారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.