
మురిపిండ మొక్క 30 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తువరకూ పెరుగుతుంది. ఇది ఏకవార్షిక మొక్క. పత్రాలు కణుపుకు ఒకటి చొప్పున ఏర్పడతాయి. అడుగున ఉండే పత్రాలకు పొడవైన పత్రవృంతాలు, పై పత్రాలకు చిన్న వృంతాలు ఉంటాయి. పత్రాలు దాదాపు వృత్తాకారంలో గాని, అండాకారంలో గాని ఉంటాయి. అంచులకు దంతాలవంటి నొక్కులుంటాయి. స్త్రీ, పురుష పుష్పాలు వేర్వేరుగా ఒకే మొక్కపైన ఏర్పడతాయి. ఆకులు పచ్చగా ఉంటాయి. స్త్రీ పుష్పాలు పత్రాలవంటి పుచ్ఛాల లోపల ఉంటాయి. వీటిపైన పురుష పుష్పాలుంటాయి. ఫలాగు గుండ్రంగా ఉండి పుచ్ఛంలోపల ఉంటాయి. ఒక విత్తనం ఉంటుంది.
పుష్పాలు, ఫలాలు : సంవత్సరం పొడవునా ఏర్పడతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా పెరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ అరణ్యాలలోను, పంటపొలాల బీడు భూములలో కలుపుమొక్కగా మురిపిండ పెరుగుతుంది. మురిపిండ మొక్కలో అన్ని భాగాలను వైద్యపరంగా ఉపయోగిస్తారు. మురిపిండ మొక్కలో అకలైఫిన్, అకలైఫమైడ్, ఆరంటియమైడ్, సక్సినిమైడ్, కెంఫెరాల్ వంటి రసాయనాలు ఉంటాయి.
మురిపిండ ఉపయోగాలు
కఫ, వాతాలను మురిపిండ నివారిస్తుంది. దగ్గు, జ్వరం, మలబద్ధకం, కఫాన్ని వెడలగొట్టడంలోను, కడుపులోని క్రిములను నివారించడంలోను, మూత్రాన్ని జారీచేయడంలోను, ఆస్థమా, బ్రాంఖైటిస్, వాంతులను తొలగించడంలోను ఉపయోగపడుతుంది.పత్రాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. చిడుము, గజ్జిని నివారిస్తాయి. పత్రాలను వెల్లుల్లితో కలిపి లోనికి తీసుకుంటే కడుపులోని క్రిములు నివారించబడతాయి. పత్రాలను ఉప్పుతో కలిపి శరీరంపై పూస్తే చిడుము తగ్గుతుంది. పత్రాల రసాన్ని కొబ్బరినూనెతో కలిపి కీళ్ళనొప్పులున్న భాగాలపై పూస్తే అవి తగ్గుతాయి. పత్రాల కషాయాన్ని లోనికి తీసుకుంటే బ్రాంఖైటిస్, ఆస్థమా, చెవిపోటు తగ్గుతాయి.
పత్రాల గుజ్జును, సున్నపుతేటతో కలిపి పైన పూస్తే కాలినగాయాలు మానుతాయి. తామర చర్మవ్యాధి తగ్గుతుంది. చిన్నపిల్లల్లో వచ్చే ఆస్థమా, బ్రాంఖైటిస్ తగ్గుతుంది. తాజా పత్రాల రసాన్ని సున్నపుతేటలో కలిపి విషకీటకాలు కుట్టినచోట పూస్తే బాధ తగ్గుతుంది. రసాన్ని ఉప్పుతో కలిపి పైన రాస్తే ఎగ్జిమా తగ్గుతుంది. దీర్ఘకాలంగా మ మంచంపై పడుకోవడం వలన వచ్చే కురుపులు ఈ మొక్క పత్రాల పొడిని చల్లటంవల్ల తగ్గించవచ్చు. వేరును నూరి కురుపులపై పట్టువేస్తే త్వరగా మానుతాయి. ఒక చెంచాడు పత్రాల రసాన్ని పిల్లలకు లోనికి ఇస్తే కఫం అంతా వాంతి రూపంలో బైటికి వస్తుంది.