మూలశంఖకు మందు ఉత్తరేణి

అమరాన్థేసి కుటుంబానికి చెందిన ఉత్తరేణి శాస్త్రీయనామం అఖిరాన్థస్ ఆస్పరా లిన్నేయస్(Achyranthes aspera). ఈ మొక్క ఇంచుమించు ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఇది బహువార్షిక మొక్క. మొక్క అంతటా నూగు ఉంటుంది. కొమ్మలు వంగి ఉంటాయి. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. అండాకారంలో గాని, దీర్ఘవృత్తాకారంలో గాని ఉంటాయి. వృతం పొట్టిగా ఉంటుంది. పుష్పాలు చిన్నవి, లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పుష్పాలు పొడవైన కంకిపైన ఏర్పడతాయి. రక్షకపత్రాలు శాశ్వతం. వీటి అగ్రభాగాలు ముండ్ల మాదిరిగా ఉంటాయి. ఫలంలో ఒక విత్తనం ఉంటుంది.

ఉత్తరేణి పుష్పాులు శీతాకాలంలోను, ఫలాలు వేసవి కాలంలోను ఏర్పడతాయి.  ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా కలుపుమొక్క వలె అన్ని రకాల భూములపై పెరుగుతుంది.  ఈ మొక్కను సమూలంగాగాని, వేరు, విత్తనాలు, పత్రాలను విడివిడిగా గాని వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఉత్తరేణి మొక్కలో ఎఖిరాంధైన్, హెంట్రియాకాంటీన్, బీటైన్ వంటి రసాయనాలు, విత్తనాలలో అమైనో ఆమ్లాలు ఉంటాయి.

ఉత్తరేణి ఉపయోగాలు

కఫ, వాత రోగాలను నివారిస్తుంది. మూలశంఖ, విరోచనాలు తగ్గుతాయి. శరీరతత్వం మారుతుంది.  మొక్క కషాయం మూత్రాన్ని సాఫీగా జారీచేస్తుంది. పత్రాల రసాన్ని కడుపునొప్పి, మూలశంఖ, సెగ్గడ్డలు, చర్మవ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు. పత్రాల కషాయాన్ని తేనెతో కలిపి తీసుకుంటే నీళ్ళ విరోచనాలు, జిగట విరోచనాలు తగ్గుతాయి.

తాజా పత్రాల రసాన్ని బెల్లంతోగాని, మిరియాలు మరియు వెల్లుల్లితో కలిపి తీసుకుంటే జ్వరంతగ్గుతుంది. విషకాటకాలు కుట్టిన భాగంపై పత్రాల రసాన్ని పూస్తే బాధ నివారణ అవుతుంది. వేరు పొడిని, మిరియాల పొడిని తేనెతో కలిపి లోనికి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. విత్తనాల పేస్టును పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.(పైపూతగా మాత్రమే).

విత్తనాలను గంజితో నూరి ఆ రసాన్ని రక్త మొలలపై పూస్తే అవి తగ్గుతాయి. విత్తనాలను పాలతో వండి చేసిన పాయసాన్ని రోజూ లోనికి తీసుకుంటే బలహీనమైన మెదడు శక్తివంతమవుతుంది. పత్రాల రసాన్ని ఎగ్జిమా, కుష్ఠువ్యాధుల నివారణలో పైపూతగా వాడతారు. పూర్తి మొక్కను నీటితో నూరి, ఆ రసాన్ని కంటిలో వేస్తే కండ్ల మసకలు పోతాయి. పాము, తేలు, జెర్రి కాటు విషాకు విరుగుడుగా కాటువేసిన భాగంపై పూస్తారు.  వేరును రేచీకటిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్క నుంచి తయారుచేసిన అపమార్గతైలాన్ని వినికిడిలోపం, చెవిలో శబ్దాలు తదితర చెవి సంబంధమైన వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు. ఇదే తైలాన్ని ముక్కులో రెండు చుక్కలు పోస్తే, ముక్కు నుండి రక్తం కారడం ఆగిపోతుంది. ఈ తైలాన్ని పాము కరిచిన భాగంపై పూస్తే విరుగుడుగా పనిచేస్తుంది.

పూర్తి మొక్కను పిప్పళ్ళతో కలిపి నూరి మాత్రలు చేసుకుని వాడితే పిచ్చికుక్క కాటుకు విరుగుడుగా పనిచేస్తుంది.
మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్ళను కరిగించడానికి సిస్టోన్ అనే మందులో ఈ మొక్కను ఉపయోగిస్తారు. వేరు పొడిని తేనెతో కలిపిలోనికి తీసుకుంటే మూలశంఖ నివారణ అవుతుంది. పిచ్చికుక్క కాటుకు విరుగుడుగా పనిచేస్తుంది. స్త్రీలలో గర్భస్రావం తరువాత జరిగే రక్తస్రావాన్ని ఆపడానికి, వేరు రసాన్ని లోనికి తీసుకోవాలి. ఈ మొక్క గుండెకు బలాన్నిస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. మూత్రాన్ని జారీచేస్తుంది.

సిద్ధ వైద్య విధానంలో బ్రాంఖైటిస్, ఆస్థమా తగ్గటానికి ఉపయోగిస్తారు. వేరు, పత్రాల రసాన్ని తేలు, పాము కరిచిన చోట వేస్తే బాధ తగ్గుతుంది. గాయాలు, కురుపుల నుండి రక్తం స్రవించకుండా ఉండటానికి, పత్రాల రసాన్ని పోయాలి. వేరు, విత్తనాల చూర్ణాన్ని తేనెతో తీసుకుంటే రక్తమొలలు తగ్గుతాయి. మొక్క చూర్ణాన్ని తేనెతో తీసుకుంటే ఆస్థమా తగ్గుతుంది. గోరుపుచ్చులు తగ్గటానికి మొక్క చూర్ణాన్ని సున్నంలో కలిపి గోరుపైన పూయాలి. మొక్క చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు, ఉబ్బసం తగ్గుతాయి. పచ్చి పత్రాలను నూరి ఆ ముద్దను గాయాలపై పూస్తే గాయాలు నయం అవుతాయి.

అపమార్గతైలం, అపమార్గ క్షారం, సురసాది తైలం, అవిల్ తోలాది భస్మం, జాత్యాదితైలం, అర్ధవిల్వం కషాయం, సువర్ణయుక్తాది గుళిక వంటి ఆయెర్వేద మందుల్లో ఉత్తరేణిని ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.