అడవికంద గుణములు
అడవికందకు వేడిచేసే గుణం ఉంది. రుచి కారముగా ఉంటుంది. విపాకమున కూడ కారపురుచిగానే ఉంటుంది. వగరు రుచి కూడా కొంచెం ఉంటుంది. మూలవ్యాధికి దివ్య ఔషధము. మంచి జీర్ణకారి. అగ్నిదీప్తిని కలిగిస్తుంది. క్రిములను హరిస్తుంది. ఉదరరోగములు, ప్లీహరోగమును తగ్గిస్తుంది. గర్భిణులు దీనిని తినకూడదు. గర్భస్రావము కలుగును. మేహవాతనొప్పులు హరిస్తుంది.మూలశంకకు మంచి మందు: అడవికంద దుంపకు మట్టిపూసి, పుటములో పెట్టి ఉడికించి, మంచినూనె, ఉప్పు కలిపి తింటే అన్నిరకముల మూలశంకలు నివారింపబడతాయి.
రక్తమూలమునకు: మిరియాలు ఒక భాగము, శొంఠి రెండు భాగములు, చిత్రమూలము 8 భాగములు, అడవికంద 16 భాగములు, బెల్లము పాకముపట్టి దానిలో పై చూర్ణములను వేసి లేహపాకముగా దింపి స్వబలము అనుసరించి సేవించినట్లయితే రక్తమూలములు హరించును.
ఋతుబద్ధము: వెదురు ఆకు కషాయములో అడవికంద చూర్ణము కలిపి సేవించినచో ఋతువు జారీ అవుతుంది. పగులని గడ్డలకు అడవికందను ఉడికించి కడితే త్వరలో పక్వమై చితుకుతాయి. ఉడికించి విషవ్రణములకు కడితే విషపురుగులు చచ్చి వ్రణములు మానిపోతాయి.