
ఈ అగురు అస్సాం రాష్ట్రంలోని, చిలకసముద్ర ప్రాంత భూములలో విస్తారంగా పెరుగుతాయి. ఆకులు కోలగా ఉంటాయి. ఇది సాధారణ జాతిలోని వృక్షం. అగురులో అనేక జాతులు ఉన్నాయి. వీటిలో వైద్యమునకు ముఖ్యముగా ఉపయోగించేసి కృష్ణాగరు. ఇది ప్రధానముగా కారముగా ఉంటుంది. చేదుకూడా కొంచెం కలిగి ఉంటుంది. వేడిచేసే స్వభావము కలిగి ఉంటుంది.
దీని ప్రయోజనాలు ఇలా ఉంటాయి
వాతము, కఫములను హరిస్తుంది. చెవి జబ్బులు, కంటి జబ్బులను పోగొడుతుంది. మంగళప్రదమైన వస్తువు. కుష్ఠురోగములను హరింపచేయడంో దీనికి మించినది లేదు. ఈ అగురు నిప్పులమీద వేసినట్లయితే సువాసన గల పొగ వెలువడుతుంది. చర్మమునకు కాంతి ఇస్తుంది. చర్మవ్యాధులను పోగొడుతుంది. దీనితో అగురువత్తులను, బిళ్ళలను తయారుచేస్తారు. ఈ బిళ్ళలను అరగదీసి గంధమును ఒంటికి రాసుకుంటే సువాసన రావడంతోపాటు బలమును, ఉత్సాహమును పుట్టిస్తుంది. ఈ అగురులోని వివిధ జాతులకు గుణములు సమానమే. ఈ అగురు నుంచి నూనెను తీస్తారు.చికిత్సా విధానం ఇలా
- కృష్ణాగురు యొక్క చూర్ణము తేనెతో కలిపి నాకితే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
- అగురునూనెను, మోదుగమాడలోని చమురును కలిపి పైనపూసినట్లయితే తామర, కుష్టు పోతాయి. ఈ నూనె నరములకు బలమును కలుగచేస్తుంది.
- పిల్లలకు ఊపిరితిత్తులలో కలిగే శ్వాసరోగములకు అగురు నూనెను బ్రాందీలో కలిపి గుండెలకు రాసినట్లయితే శ్లేష్మము కరిగి, ఉపశమనము కలుగుతుంది.
- తీవ్రమైన తలనొప్పి ఉన్నప్పుడు ఇది తలకు రాసినట్లయితే నొప్పి నివారణ అవుతుంది.
- అగురునూనె మన దేశములో ఆదికాలము నుండీ వాడుకలో ఉన్న తలనూనెలలో ఒకటి. కృష్ణాగురు చెక్కతో దీనిని తయారుచేస్తారు. ఇది చాలా సువాసనగా ఉంటుంది. వేడిచేస్తుంది. శ్లేష్మము, వాతము, కుష్ఠు, రక్తపిత్తములను హరిస్తుంది. క్రొవ్వును తగ్గిస్తుంది. శరీరంపై వచ్చిన కురుపులను తగ్గిస్తుంది.
- ముఖ్యముగా కళ్ళమంటలు, తలత్రిప్పు, తలపోట్లు తగ్గిస్తుంది. చుండ్రు పోగొడుతుంది. వెంట్రుకలను నల్లబరిచి జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. వెంట్రుకలు రాలిపోకుండా కాపాడుతుంది. జుట్టు నెరవకుండా చూస్తుంది.
- అగురువత్తులను అగురునూనెతోను, పునుగుతోను, అంబరుతోను, జవ్వాజితోను, కస్తూరితోను తయారుచేస్తారు. నెల్లూరు, చెన్నై, బెంగుళూరు, మైసూరు తదితర ప్రాంతాల్లో వీటిని ఊదువత్తులు అని పిలుస్తారు. ఇళ్ళలోను, సభలు, సమావేశాలు, శుభకార్యములు వీటివల్ల శోభాయమానంగా ఉంటాయి.
- వైభవమునకు, భోగమునకు కూడ ఇవి గుర్తు. ఇంతేకాక వీటి పొగతో వాతావరణము సువాసనతో నిండి, దుర్వాసన పోతుంది. క్రిములు నశిస్తాయి. దోమలు తగ్గుతాయి. మనసునకు ఆహ్లాదము, హృదయమునకు ఆనందమును కలిగిస్తాయి.