అక్కలకఱ్ఱ గుల్మజాతికి సంబంధించిన మొక్క. దీని ఆకులు మాచీపత్రి ఆకుల్లా కనిపిస్తాయి. కాయలు గుండ్రండా ఉంటాయి. పూవులోనే విత్తనాలు ఉంటాయి. ఈ మొక్క వేరునే అక్కలకఱ్ఱ అని పిలుస్తారు. దీని ఆకులకు, కాయలకు కొద్ది ఉపయోగము ఉన్నా వేరుకు మాత్రం విశేష ప్రయోజనం ఉంటుంది. భావప్రకాశకాకారుని పరిశోధనలో ఈ మొక్క ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇతని కాలములో ఫిరంగిజాతివారు ప్రవేశించడం వల్ల వారి ద్వారా దేశములో సాంక్రామిక, సవాయి వ్యాధి వ్యాపించడం జరిగింది. దానిని ఫిరంగి రోగమని భావప్రకాశకారుడు పేరు పెట్టడం జరిగింది. ఆ రోగములు తగ్గిచడానికి ఇతడు అక్కలకఱ్ఱను వినియోగించాడు.
గుణములు: అక్కలకఱ్ఱ వేడిచేయు స్వభావము కలిగినది. రుచికి కారంగా ఉంటుంది. నరములకు మిక్కిలి బలమును కలుగచేస్తుంది. సాధారణ శ్లేష్మ వాతములను అన్నింటిని పోగొడుతుంది. ఇది చర్మముపై వేస్తే పొక్కుతుంది. వాతపు వాపులు, దెబ్బలవలన కలిగిన వాపులు దీనివలన తగ్గుతాయి. మంచి జీర్ణకారిగా పనిచేస్తుంది. శరీరములోని వేడి తగ్గించి చెమటను బైటికి పంపిస్తుంది. మూర్ఛ రోగములు కూడా దీనివల్ల హరింపబడతాయి. వీర్యస్తంభనము కలిగిస్తుంది. విరేచనకారి.
చికిత్సలకు ఇలా వినియోగించాలి
- వాపులను పోగొట్టడానికిగాను అక్కలకఱ్ఱ వేరు గంధముగా అరగదీసి వాపులు గల ప్రదేశములో పట్టువేసి కొంచెము శగ చూపిస్తే బాధ శమించి వాపులు తగ్గుముఖం పడతాయి.
- మూర్ఛరోగము తగ్గించడానికి వేరును రసముగా చేసి ఐదు నుంచి ఆరు చుక్కలను ముక్కులో వేసి పీల్పించాలి. అంతేకాక దీని కషాయమును ఒక అరచెంచా లోనికి తీసుకుంటే తెలివి వస్తుంది.
- పార్శ్వముపై(తలపై) నొప్పి వస్తున్నప్పుడు దీని వేరును గంధముగా అరగదీసి కణతలకు పట్టులా వేస్తే ఉపశమనం కలుగుతుంది. అంతేకాక శరీరముపై గడ్డలు ఏర్పడినప్పుడు గంధం పట్టులావేస్తే గడ్డలు చితుకుతాయి.
- పుప్పిపంటి నొప్పిని పోగొట్టాలంటే వేరు చూర్ణమును కొద్దిగా ఆ పంటిలో వేసి నొక్కితే బాధ ఉపశమిస్తుంది.
- విపరీతమైన జలుబు చేసినప్పుడు అక్కలకఱ్ఱ కషాయమును కొంత లోపలికి తాగి, కొంత పుక్కిలిస్తే ఊపిరాడని పరిస్థితినుంచి బైటపడవచ్చు. అలాగే గొంతు నొప్పి, నాలుక అరుచి కూడా ఉపశమిస్తుది.
- మాటలు ముద్దముద్దగా వస్తున్నప్పుడు అక్కలకఱ్ఱ చూర్ణమును తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే నాలుక పలుచబడి మాటలు సక్రమంగా వస్తాయి. చిలుక, గోరింక వంటి పక్షులకు మాటలు రావడానికి ఈ చూర్ణమును ఇస్తారు.
- ఫిరంగి రోగమును తగ్గించడానికి అక్కలకఱ్ఱ ఒక అరచెంచా, పాదరసము ఒక అరచెంచా, చండ్ర చూర్ణము చిటికెడు, తేనె ఒక చెంచా కలిపి నూరి, ఆ మిశ్రమాన్ని ఏడు మాత్రలుగా చేయాలి. వీటిని ప్రతిరోజూ పరగడుపునే ఒక్కోమాత్ర వంతున నీటితో వేసుకోవాలి. ఈ మాత్రలు వేసుకున్నప్పుడు ఉప్పు, పులుపు మానివేస్తే మందు పట్టు ఇస్తుంది.
- వీర్యస్తంభనకు ఆకారకరభాదివటి మంచి మందు. అక్కలకఱ్ఱ, తక్కోలములు, శొంఠి, పిప్పళ్ళు, జాజికాయ, కుంకుమపువ్వు, మంచిగంధము, లవంగాలు తీసుకోవాలి. వీటికి నాలుగు రెట్లు నల్లమందు తీసుకుని, ఇవన్నీ కలిపి చూర్ణముగా చేయాలి. దీనిని తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే వీర్యస్తంభనము చేస్తుంది.
- నెలసరిలో బాధలు తగ్గించడానికి అక్కలకఱ్ఱ మంచి మందుగా పనిచేస్తుంది. దీని రసమును గోపీచందనము, నెయ్యి, పంచదార కలిపి సేవిస్తే రుతుసంబంధమైన దోషాలు తొలగుతాయి. -పచ్చి అక్కలకఱ్ఱ ముద్దగా చేసి శరీరంపై పూసినట్లయితే ఎముకలు విరగడం, విడివడిన మొదలైనవన్నీ ఉపశమిస్తాయి. దీని శాస్ర్తీయ నామము మెటీరియా మెడికా ఆఫ్ ఇండియా.