అడవి పొట్ల-శాస్త్రీయంగా పటోల అని పిలుస్తారు. దీని శాస్త్రీయ అంగ్ల నామం Trichosanthes Dioica. అడవులలోను, అడవి ప్రదేశముల సమీపంలోని పొలాలలోను తీగలా పాకుతుంది. ఆకారము మామూలు పొట్ల వలె ఉంటుంది. ఆకులు చిన్నవి. తీగ నాలుగైదు గజాల కంటె ఎత్తు పెరగదు. పువ్వు తెలుపుగా ఉంటుంది. ఆకులు నూగు కలిగి గరుకుగా ఉంటాయి. కాయ మిక్కిలి చేదుగా ఉంటుంది. కాయ దొండకాయ ఆకారంలో ఉంటుంది. కొంచెం మురవ కలిగి, రెండంగుళాల పొడవు, తెల్లటి చారలతో అందముగా ఉంటుంది. కాయ పండిన దొండపండు వలే నెర్రగా ఉంటుంది. సర్వాంగములు చేదుగానే ఉంటాయి. తీగ ఎండిపోయినా పండు చాలారోజుల వరకూ పచ్చిగానే ఉంటుంది. కనుకనే దీనికి అమృతఫలం అని పేరుపెట్టారు.
అడవి పొట్ల గుణములు
కుష్టురోగమును పోగొట్టు ప్రభావము దీనికి కలదు. అందువల్ల కుష్టుహారి అనే పేరు ఉంది. ఇది దగ్గును పోగొడుతుంది. కావున కాసముత్ల్కిద అనే పేరు కూడా ఉంది. కారము, చేదు కలిగిన రుచి కలిగి ఉంటుంది. వేడిచేసే స్వభావముతో ఉంటుంది. విపాకమున కారపు రుచిగా మారును. మలబద్ధకమును పోగొట్టి విరేచనము చేయును. కఫమును హరించును. రక్తమును బాగుచేయును. దురద, కుష్టును నశింపచేయును. శరీరతాపము, జ్వరములను తగ్గించును. జీర్ణకారి, హృదయమునకు మంచిది. వీర్యవృద్ధిని కలిగించును. నులిపురుగులను చంపును. ప్రత్యేకముగా దీని వేరునకే విరేచనము చేయు గుణము కలదు. తీగ యొక్క కాడ శ్లేష్మమును హరించును. ఆకులు పైత్యశాంతినిచ్చును. పండు మూడు దోషములను తగ్గించును.
అడవి పొట్ల ఉపయోగాలు
- రక్తహనత: వట్టివేళ్ళు, అడవి పొట్లఆకులు చూర్ణముచేసి పంచదారతో పుచ్చుకొనినను లేక కషాయము పెట్టి ఆ కషాయములో పంచదార కలిపి సేవించినచో రక్తహఈనత, రక్తపైత్యము పోవును.
- మదాత్యయ రోగాలకు: ఆల్కహాల్ అధికంగా తీసుకునేవారిలో - లివర్ సిరోసిన్ వల్ల – కడుపు నొప్పి వచ్చే అవకాశముంది. అడవిపొట్ల తీగ అంతయును చితకకొట్టి 1 తులము చూర్ణము చొప్పున కషాయము పెట్టి సేవించినట్లయితే మత్తుపానీయాలు అధికంగా సేవించడం కారణంగా వచ్చే వివిధ రోగాలు రూపుమాసిపోవును.
- వాపులు తగ్గడానికి: ఆకులు, కాయలు కూర వండుకుని తింటే ఉపశమిస్తాయి విషములను హరించేందుకు ఆకుగాని, కాయలుగాని కూరవండుకుని తినవలెను.
- ఊరుస్తంభవాతమునకు: ఉప్పు వేయకుండా నీళ్ళతో ఉడికించి, నూనెతో తాలింపు పెట్టుకుని, ఆకుకూర వండుకుని తినవలెను.
శ్లేష్మ పైత్యములు కలిసి ఉన్న జ్వరములకు :
- శరీర పై జ్వరములకు: అడవిపొట్ల, వేపచెక్క కషాయము సేవించిన పైజ్వరము శమించును. జ్వరములలో పత్యమునకు గాను అడవిపొట్ల కూర ఉపయోగించవలెను. తీవ్రమగు పైత్య జ్వరము కలవారు, దీని కషాయములో తేనె కలిపి పుచ్చుకొనిన తక్షణము తాపము నశిస్తుంది.
- వాతవ్యాధికి: అడవి పొట్ల పండ్లు కట్టుగా తయారుచేసి సేవించిన వాతము తగ్గును.
- మశూచికమునకు: మశూచికముగల రోజులలో మశూచికము వస్తుందనే అనుమానము కలిగినపుడు, అడవిపొట్ల వేరు కషాయము ఇచ్చినట్లయితే మశూచికము రాకుండా కాపాడుతుంది.