అవిసిచెట్లు సాధారణముగా చెఱకు, తమలపాకుల తోటలలో విస్తారముగా ఉంటాయి. వీటిలో తెలుపు, ఎరుపు, నలుపు, పసుపురంగు గల నాలుగు జాతులు ఉన్నాయి.
పువ్వుయొక్క రంగును బట్టి జాతిని తెలుసుకోవాలి. ఈ చెట్టు పువ్వు వంకరగా ఉంటుంది. కాయలు సన్నముగా, పొడవుగా ఉంటాయి. ఏడాది మొక్క అయ్యేసరికే పూత ప్రారంభం అవుతుంది. దీనికి వ్రణహారి అనే పేరు కూడా కలదు. దీని గుణమును బట్టే ఈ పేరు వచ్చింది.
అవిసి గుణములు
ఈ పువ్వు తియ్యని రుచి గలది, చలువచేస్తుంది. మూడు దోషములను హరించును. దగ్గు, ఒగర్పును తగ్గిస్తుంది. పైత్యమును హరింపచేస్తుంది. తరచుగా వచ్చే జ్వరమును తగ్గిస్తుంది. పువ్వు వగరుగాను, చిరుచేదుగాను ఉంటుంది. రేచీకటి తొలగించడానికి ఇది పెట్టిందిపేరు. దీని ఆకులు కారముగాను, కొంచెము చేదుగాను ఉంటాయి.అవిసి లేదా అగసి ఉపయోగాలు
అవిసికి నులిపురుగులకు హరించే శక్తి ఉంది. అంతేకాక పురికోస(తేలు జాతికిచెందినది), సాలెపురుగు మొదలగు విషపురుగుల విషాన్ని హరిస్తుంది. లేతకాయలు, ఆకు కూరకు వినియోగిస్తారు. ముదిరిన కాయలు పైత్యము చేస్తాయి. దీని ఆకు రసము పైపూతగా వినియోగిస్తే గవదబిళ్ళలు కరిగిపోతాయి.రేచీకటికి మంచి మందు: అవిసి ఆకు మెత్తగా నలగగొట్టి కుండలో వేసి, ఉడకబెట్టి రసము పిండి, ఆ రసాన్ని ఒక అరటీస్పూను వంతున సేవిస్తే రేచీకటి పోతుంది. ఇది ప్రయోగపూర్వకంగా రుజువైందని ఆయుర్వేదవైద్యులు చెప్తారు.
- ఇంకా అవిసిఆకును, మిరియాలను ముద్దగా నూరి 4 లేక 5 చుక్కలు పిండి పీలిస్తే ఆపస్మారకము నుంచి తేరుకోవచ్చు.
- ఆకు రసము, మిరియాలు కలిపి 15 చుక్కలు సేవించినా, రెండు చుక్కలు నస్యము చేయించినా తెలివివస్తుంది.
- నాలుగురోజులకు ఒకసారి వచ్చే జ్వరానికి ఆకు రసము 6 చుక్కలు నస్యము చేయించినచో పై జ్వరము తగ్గుతుంది. ఇలా మూడు రోజులపాటు వరుసగా చేయాలి.
- దీనివేరు తేనెతో అరగదీసి కంటికి కాటుకలా పెడితే కంట్లో వచ్చే కొయ్యకండలు, పువ్వులు కరిగిపోతాయి.
- గింజలు వేడిచేసే స్వభావము కలిగి ఉంటాయి. వ్రణములను తగ్గిస్తాయి. గింజల కషాయము మూత్రమును తేలికగా అయ్యేలా చేస్తాయి. శరీరములో మూత్రము బంధమైనపుడు దీనిని ఉపయోగిస్తారు.
- నడుము నొప్పులకు, వాపులకు గింజలను ముద్దగా నూరి పట్టులా వేస్తే శమిస్తాయి.
- అవిశనూనె మేహ వ్రణములను రాసినట్లయితే మానిపోతాయి. మొత్తంగా ఈ చెట్టుయొక్క సర్వాంగములు మనిషికి ఉపయోగపడేవే.