మొక్క రూపు రేఖలు
అగ్నివేండ్రము మొక్కజాతికి చెందిన ఒక వనమూలిక. భూమి నుండి అరగజం ఎత్తు గుజ్జుగా పెరుగుతుంది. కొమ్మలు నాలుగు అంగుళాలు పొడవు ఉంటాయి. కాడ, ఆకులు ఎరుపు తెలుపు కలిపిన రంగుగా ఉంటాయి. ఆకు చిన్నగాను, కోలగాను ఉంటాయి.చెట్టు ముదిరిన కొలదీ పసుపు, ఎరుపును కలిగి ఉంటాయి. పువ్వులు చిన్నగా ఉంటాయి. తేమగల వరిచేలగట్లపై విస్తారముగా పెరుగుతాయి. అన్ని ప్రాంతాలలోను ఇవి సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి.
వినియోగం ఇలా...
వీటి రుచి కారముగా ఉంటుంది. వీటిని నూరి శరీరానికి కడితే పొక్కి పుండవుతుంది. విపరీతమైన మంట వస్తుంది. అయితే దీనిని ముద్దగా నూరి ఆ ముద్దను నాడికి కడితే పొలిజ్వరము పోతుంది. పగులకుండా ఇబ్బందిపెడుతున్న గడ్డలకు కడితే వెంటనే పగులుతాయి.పాటించాల్సిన జాగ్రత్త ఏంటంటే నొప్పి, వాపు లేనిచోట దీనిని ఉపయోగించకూడదు. ఎండబెట్టిన ఆకుల చూర్ణము నాలుగు గురివిందగింజల ఎత్తు తేనెతో కలిపి ఇచ్చినట్లయితే శ్లేష్మము దిగుతుంది. దీని రసముతో చోడిపిండి ఉడికించి పట్టువేసినచో వాపులు హరిస్తాయి. వేరు చూర్ణము మేహశాంతి చేస్తుంది.