మొక్కలో ప్రతీఅంగము పెళుసుగా ఉంటుంది. తెల్లని నూగు కలిగి ఉంటుంది. మొక్క ముదిరి, పండితే బూడిదరంగుగా మారుతుంది. గింజలు కొంచెం చమురు కలిగి ఉంటాయి. గింజలే వైద్యానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. మొక్కకు ఘాటైన సువాసన ఉంటుంది. బీడు భూముల్లో విస్తారముగా పెరుగుతాయి.
ఉపయోగాలివే...
అజామోదము మొక్క రుచి కారముగా ఉంటుంది. గుణము తీక్షణము. వేడిచేసే స్వభావము ఉంటుంది. ఉడకబెట్టినా కూడా కారపురుచిని కోల్పోదు. జఠరాగ్నిని వృద్ధిచేస్తుంది. వాత కఫములను రెంటిని పోగొడుతుంది. గుండెకు మంచిది. వీర్యవృద్ధిని చేస్తుంది. మంచి బలమును కలుగచేస్తుంది. నేత్ర రోగములను, వాంతులను, ఎక్కిళ్ళను, పొత్తికడుపులోని నొప్పిని హరిస్తుంది. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. నులిపురుగులను చంపుతుంది.చిన్నపిల్లల్లో కడుపు ఉబ్బరం తగ్గడానికి అజామోదము పది గురివిందగింజల ఎత్తు, శొంఠి 5 గింజల ఎత్తు, దుంపరాష్ట్రము 5 గింజలఎత్తు నీళ్ళతో నూరి పొంగించి, రసము పిండి చంటిపిల్లలకు పట్టించినట్లయితే కడుపు ఉబ్బరము, గొంతుకలోని గుఱక తగ్గుతాయి.