ఆవుపాలు సేవిస్తే బుద్ధిబలం పెరుగుతుంది. దీనివల్ల ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఆవుపాలు రక్తశుద్ధిని, రక్త పుష్టిని కూడా కలిగిస్తాయి. ప్రతిరోజూ ఆవుపాలని వాడితే శరీరం కాంతివంతంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పాలలో క్రొవ్వు శాతం తక్కువగా ఉండడం వల్ల అన్ని వయసుల వారు ఆవుపాలు తాగవచ్చు. ముఖ్యంగా చంటిపిల్లలకు పట్టిస్తే సులభంగా జీర్ణం అయి పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు.
ఆవు పాలతోపాటు మజ్జిగ, పెరుగు, నెయ్యి అన్నీ ఆరోగ్యానికి ఎంతో మంచివి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు ఆవు పెరుగు, మజ్జిగ వాడడం వల్ల వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆవు నెయ్యి దీపారాధనలకు ఎంతో శ్రేష్టమైనది. ఆ దీపం నుంచి వచ్చే కాంతిలోని కిరణాల వల్ల కూడా ఇల్లంతా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆవునెయ్యి దీపారాధన లక్ష్మీప్రదం కూడాను.
ఆవునెయ్యి వాడకం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే ఆయుర్వేద మందుల్లో ఆవునేతిని వాడతారు. ఆరోగ్యంతోపాటు సౌందర్యాన్ని కూడా ఆవుపాలతో పరిరక్షించుకోవచ్చు. ఆవుపాలను ముఖం, మెడ, చేతులకు రాసుకుని గంట సేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.
అయితే దేశీయ ఆవుల పాలల్లో ఎన్నో ఔషధ విలువలు ఉంటాయి. మన ఆవులను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపైనా ఉంది. గోసంరక్షణ కోసం మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమ్మలా మనకు మేలు చేసే గొప్ప ప్రాణి ఆవు. అందుకే ఆవును గోమాత అన్నారు. తల్లి తర్వాత తల్లిలాంటిది ఈ గోమాత. గోవును పూజిస్తే సర్వ దేవతలను పూజించినట్లే.