విరోచనాలకు సిసలైన విరుగుడు ‘ఉత్తరేణి’


రెండుమూడు మీటర్ల ఎత్తులో గుబురుగా పెరిగే ఉత్తరేణి మొక్క వాతం, విరోచనాలను తగ్గించడమే కాక మూలశంఖ వ్యాధికి అద్భుతంగా పనిచేస్తుంది. అభిరాస్థస్ అస్పరాలిన్నేయస్ అనే అమరాన్థేసి కుటుంబానికి చెందినదిగా ప్రాచుర్యం కలిగిన ఉత్తరేణి వేర్లు, విత్తనాలు, ఆకులు పలు వ్యాధుల నివారణకు ఉపకరిస్తాయి. గ్రామీణ ఆయుర్వేద వైద్యులు తమ ఇళ్ళలో పెంచుకుని వైద్యం చేస్తారు. ఈ మొక్కలోని పలు భాగాల కషాయం మూత్రకోశ వ్యాధులకు పనిచేస్తుంది. ఆకుల రసం కడుపునొప్పి, మూలశంఖ, సెగ్గడ్డల నివారణకు ఉపయోగపడుతుంది.

మొక్క వేరును ఎండబెట్టి చేసిన పొడిని మిరియాల పొడితో కలిపి సేవిస్తే దగ్గు తగ్గుతుంది. విత్తనాల పేస్టు పాముకాటుకు విరుగుడుగాను, పత్రాల రసాన్ని ఎగ్జిమా, కుష్టువ్యాధి సోకిన చోట పై పూతగా వాడతారు. రేచీకటికి మొక్క వేళ్ళ భాగాలను ఉపయోగిస్తారు. కళ్ళ మసకలకు మొక్క అన్నిభాగాల మిశ్రమ రసాన్ని కళ్ళలో డ్రాప్సు గా వాడతారు. అంతేకాకుండా రేచీకటిని తగ్గించడానికి వేరును, మొక్క పూర్తి భాగాలను వినికిడి లోపానికి, మూత్రపిండాల, మూత్రకోశ వ్యాధులకు విరివిగా ఉపయోగిస్తారు.

ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ , తెలంగాణాల్లో అంతటా కలుపు మొక్కలుగాను, ఫెన్సింగ్‌లవలే  పెరుగుతుంది. ఈ మొక్కలో ఎఖిరాంథైన్, హెంట్రియాకాంటీన్, బీటైన్ రసాయనాలు ఉన్నాయి. ప్రత్యేకంగా మొక్క విత్తనాల్లో అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి వివిధ వ్యాధులకు దివ్య ఔషధాలు. ఎక్కువగా మూలశంఖ వ్యాధికి చక్కగా పనిచేస్తుంది.

గర్భస్రావం తర్వాతి రక్తస్రావాన్ని ఆపడానికి, గుండెకు బలానికి, రక్తమొలలు పోగొట్టడానికి, గోరుల్లోని పుచ్చులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సిద్ధవైద్యులు ఈ మొక్కను ఆస్మా తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఉత్తరేణి మొక్కను సంస్కృతంలో వైద్య విద్వాంసులు ‘అపామార్గ’ అని పిలుస్తారు. ఆయా ప్రాంతాల్లో ఈ మొక్కను కుక్కురుదంతి, ధిచ్చరి అని పిలుస్తారు.

ఈ మొక్కను అపామార్గతైలం, అపమార్గ క్షారం, సురసాది తైలం, అవిల్తోవాది భస్మం, జాత్యాది తైలం, అర్ధవిల్వ కషాయం, సువర్ణయుక్తాది గుళికలు తయారీలో ఉపయోగిస్తారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.