జుట్టు సమస్యలు-నివారణోపాయాలు


వెంట్రుకల సమస్యలు సాధారణంగా ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్నవే. ఆడవారు, మగవారు అనే తేడా లేకుండా అందరినీ ఈ జుట్టు సమస్య వేధిస్తోంది. వెంట్రుకలు, గోళ్ళు, చర్మం మన ఆరోగ్యానికి సూచికలుగా చెప్పవచ్చు. నేటి కాలంలో కాలుష్యం, వాతావరణ ప్రభావం , జన్యు పరమైన కారణాలు తదితరాలవల్ల జుట్టు రాలటం సాధారణం అయిపోతోంది.మార్కెట్లో దొరికే ఎన్నిరకాల షాంపూలు ఉపయోగించినా సమస్య తీరక చాలామంది బాధపడుతూ ఉంటారు.  కొందరికి జుట్టులో చుండ్రు పెరిగిపోయి, దురద, మంట కలుగుతూ ఉంటుంది. అంతేకాక ఒత్తుగా ఉన్న జుట్టు ఉన్నట్టుండి కొద్ది కాలంలోనే రాలిపోతుంటే ఇబ్బందిపడుతూ ఉంటారు. పలుచగా ఉన్న జుట్టుతో నలుగురిలో తిరగలేక మొహమాట పడుతూ ఉంటారు.  మీ సమస్యల పరిష్కారం కోసం కొన్ని సూచనలు కింద ఇస్తున్నాం.

జుట్టు జిడ్డుగా ఉండే వెంట్రుకలు, పొడి వెంట్రుకలు, సాధారాణ వెంట్రుకలు అనే మూడు రకాలుగా ఉంటుంది.

జిడ్డుగా ఉండే వెంట్రుకలు


మీ తలపై చర్మంలో ఉండే గ్రంధులు అధిక నూనెలను ఉత్పత్తి చేయటం వలన జుట్టు జిడ్డుగా మారుతుంది. జిడ్డుగా ఉండే జుట్టు అతుక్కుపోయినట్టుగా ఉండి, దుమ్ము, ధూళిని అధికంగా గ్రహిస్తుంది. దీనివల్ల వెంట్రుకల మధ్య చుండ్రు ఏర్పడి జుట్టు రాలటానికి కారణం అవుతుంది.

ఇలాంటి జుట్టు ఉన్నవారు తలకు నూనెలను వాడకూడదు, వెంట్రుకలకు బలాన్ని అందించే సిరప్ లను వాడాలి. జుట్టు ఆరోగ్యంగా ఉండానికి హెన్నాని వాడాలి. నాణ్యంగా ఉండే షాంపూలు మాత్రమే వాడాలి. దీంతో తలలోని దుమ్ము, ధూళి తగ్గుతాయి.

పొడి వెంట్రుకలు(డ్రై హెయిర్)

తలపై ఉండే చర్మ గ్రంధులు నూనెలను సరిగా ఉత్పత్తి చేయకపోవటం వలన వెంట్రుకలు పొడిగా మారతాయి. సూర్యకాంతి, దుమ్ము, ధూళి వలన జుట్టు పాడయిపోతుంది.

పొడి జుట్టు వలన అనేక సమస్యలు కలుగుతాయి. పొడిగా ఉండే జుట్టు వలన కూడా తలపై చర్మం చుండ్రుకి ప్రభావితం అవుతుంది. ఇది వెంట్రుకల మొత్తానికి పాకి చూడటానికి అంద విహీనంగా కనపడుతుంది. వెంట్రుకలు ఎక్కువగా పొడిగా మారటం వలన జుట్టు పాడై చిట్లిపోతుంది.

జుట్టు రాలటాన్ని నివారించే కొన్ని మార్గాలు


  • వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి తాజా పండ్లు & కూరగాయలను తినాలి.
    జుట్టును శుభ్రపరిచుటకు మరీ చల్లని, మరీ వేడి నీరు వాడకూడదు. గోరు వెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి.

  • రోజు గోరువెచ్చని హెర్బల్ నూనెలతో మసాజ్ చేయండి. మీ చేతి వేళ్ళని మాత్రమే వాడి నెమ్మదిగా మసాజ్ చేయండి. ఆ తరువాత, 5 నుండి 10 నిమిషాల వరకు వేడి టవల్'ని మీ తల చుట్టూ చుట్టండి.

  • గుడ్డులోని సొనను తీసి పత్తితో మీ తలపై చర్మానికి అద్దండి. అలాగే 4 నుండి 5 గంటల పాటు వదిలేయాలి. ఆ తరువాత ఒక మంచి హెర్బల్ షాంపూతో కడిగివేస్తే మీ జుట్టు నిగనిగలాడుతుంది.

  • పొడి జుట్టు సమస్య ఉన్నవారు రాత్రి పడుకునే సమయంలో కొబ్బరి నూనెతో గాని, బాదం నూనెతో గాని మసాజ్ చేయటం మంచిది. దీనివల్ల వెంట్రుకల మొదళ్ళలో కదలికలు జరిగి, కేశాలు ఆరోగ్యకరంగా ఉంటాయి.

  • ప్రతి రోజు ఒక మంచి హెర్బల్ కండిషనర్'ను ఉపయోగించి జుట్టుని కడగండి. ఒత్తిడి, అధిక పని వంటి వాటి వలన మీ జుట్టు ఆరోగ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. సరైన సమయానికి నిద్ర పోవడం, నిద్ర నుంచి లేవటం అలవాటు చేసుకోవాలి. సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. మరియు అధిక మొత్తంలో నీటిని తాగండి.

  • డ్రయర్'లను వాడే సమయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవడం మంచిది. అధిక వేడి మరియు స్పీడ్'లతో ఉన్న డ్రయర్'ను వాడటం వలన జుట్టు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.

  • టీ డికాషన్ తో గానీ, స్నానం చేసే నీటిలో కొద్దిపాటి నిమ్మరసం కలిపి కానీ వారానికి ఒకసారి  తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.

  • ఎప్పటికపుడు సమయానికి అనుగుణంగా జుట్టు కొనలను కత్తిరించాలి. దీనివల్ల అవి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, పెరుగుదల కూడా మెరుగుపడుతుంది.

  • సూర్యరశ్మికి, కాలుష్యానికి వీలయినంత దూరంగా ఉండటం మంచిది. తినే ఆహరం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహరం, పండ్ల రసాలు, మరియు సలాడ్'లను ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఆహారంలో పోషకాల కొరత లేకుండా చూసుకుంటూ కూల్ డ్రింకులు, జంక్ ఫూడ్ లకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉంటే మీ ఆరోగ్యానికి మరియు జుట్టుకు కూడా చాలా మంచిది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.