మధుమేహానికి మూడు చిట్కాలు


మధుమేహానికి నివారణ లేదు. కేవలం అదుపులో ఉంచుకోవడమే ఇప్పటికీ వైద్యరంగంలో ఉన్న ఏకైక విధానం. ఒకసారి ఈ వ్యాధిబారిన పడితే ఆరోగ్యం, ఆహారం అన్ని విషయాల్లోను తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి. అయితే ఈ వ్యాధి మనం ఊహించినంత భయపడేదేమీ కాదు. ఆరోగ్యం విషయంలో ఓ క్రమశిక్షణ పాటిస్తే మన ఒంట్లో ఉన్న షుగర్ లెవెల్స్ ను మన అదుపులోనే ఉంచుకోవచ్చు. ఇవన్నీ అందరూ చెప్పే విషయాలే. కానీ పాటించేది మాత్రం కొందరే అన్న విషయం మనకీ తెలుసు. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే షుగర్ వ్యాధిగా కూడా పిలిచే మధుమేహం బారిన పడ్డవారు సమయానికి నిద్రపోవాలి. సమయానికి భోజనం చేయాలి. ఒకేసారి ఎక్కువ మాత్రంగా కాకుండా సమపాళ్ళలో రోజుకు నాలుగుసార్లు భుజించడం మంచినది డాక్టర్లు కూడా సూచిస్తారు.

ఆహారపు అలవాట్ల విషయంలో స్థూలకాయులు పాటించే నియమాలు వేరే ఉన్నాయి. అలాగే సన్నగా ఉండేవారు వేరే నియమాలు పాటించాలి. ఆహార నియమాల విషయంలో స్థూలకాయం, ఒబేసిటీ ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే.

అయితే ఒంట్లో షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవాలంటే పూర్తిగా మందుల మీదే ఆధారపడడం మాత్రం మంచిదికాదు. మనకు అందుబాటులో ఉన్న సహజ వనరులతో కూడా గ్లూకోజ్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల సైడ్ ఎఫెక్టుల సమస్య కూడా తగ్గుతుంది.

ఇందుకోసం ఈ మూడు చిట్కాలను పాటించి చూడండి. మంచి ఫలితం రావచ్చు.

వేపచిగురు వైద్యం


మన ఒంట్లో ఉన్న అధిక గ్లూకోజ్ లెవెల్స్ ను వేగంగా తగ్గించే శక్తి వేపచిగురుకు ఉంది. ఆయుర్వేద విధానంలో లాగ చూర్ణం చేసుకునే, పసరు చేసుకునో తాగనవసరం లేకుండానే లేత వేప చిగురుని నేరుగా నమిలి మింగితే చాలు, మంచి గుణం కనిపిస్తుంది. ఉదయాన్నే టిఫిన్ చేసిన తరువాత కొద్దిగా వేపచిగురు నమిలి మింగితే భోజనానంతరం వరకూ శరీరంలోని గ్లూకోజ్ పెరగకుండా చూస్తుంది.

మెంతులతో మంచి గుణం


వేపచిగురు లాగే మెంతులకు కూడా షుగర్ లెవెల్స్ తగ్గించే శక్తి ఉందని పెద్దలు చెపుతారు. మన పోపుల డబ్బాలో ఉండే మెంతులు ఓ పది గింజలు తీసుకుని వాటిని పూర్తిగా నమిలి మింగితే గ్లూకోజ్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలా అని అధిక మోతాదులో తీసుకోవడంకూడా మంచిది కాదు. మెంతులు నమలలేని వాళ్ళు వాటిని పొడిచేసుకుని నీళ్ళతో కలిపి కూడా తీసుకోవచ్చు.

కాకరకాయ కూర చాలు


పచ్చి కాకరకాయ నమలాలంటే ఎవరికైనా కష్టమే. కానీ కాకరకాయను పూర్తిగా వేయించకుండా, పూర్తిగా ఉడకపెట్టకుండా తయారుచేసే కూరలు కనీసం వారానికి మూడు రోజులయినా సరే తినడం ద్వారా గ్లూకోజ్ లెవెల్స్ ను కొంతవరకూ అదుపులో ఉంచుకోవచ్చు. మీరు చేయగలిగితే కాకరకాయ రసం తాగడం ఉత్తమమైన పద్ధతి. ఇది మనం వాడే మాత్రలతో సమంగా ఫలితం చూపిస్తుంది.

మనం నిత్యం విధి నిర్వహణలతో బిజీగా ఉంటాం. పొరపాటుగానో, తప్పనిసరిగానో తీపితో కూడిన ద్రవపదార్ధాలను తీసుకుంటూనే ఉంటాం. పండుగలు, పబ్బాల్లో, బంధువులు, స్నేహితుల ఇళ్ళలో మొహమాటానికో, బిడియానికో స్వీట్లు కూడా లాగించేస్తాం. ఇలాంటి సందర్భాల్లో మనం వాడే ఇంగ్లీషు మందు ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి చిట్కాలు పాటిస్తే మన ఒంట్లోని షుగరును కొంతవరకూ అదుపులో ఉంచుకోవచ్చు. ఈ చిట్కాలు చికిత్సా విధానాన్ని మానేసి చేయమంటున్నవి కావు. వాటికి అదనంగా సూచిస్తున్నవి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.