చింతచెట్టును ఆమ్లక, వృక్షామ్ల అని సంస్కృతములో వ్యవహరిస్తారు. ఇది మహావృక్షము లలో ఒకటి. 'Tamarindus Indicus' అనేది దీని శాస్త్రీయనామం. ఈ చెట్టు మ్రాను బెరడుగట్టి నార కలిగి ఉంటుంది. చింతచెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి. కాయలు పుల్లగా ఉంటాయి. పళ్ళు తీపి మరియు పులుపు కలిగిన రుచి కలిగి ఉంటాయి. పువ్వులు రెండు మూడు రకాల రంగులతో ఉంటాయి. చిగురు కొన్ని చెట్లకు ఎర్రగాను, కొన్నింటికి తెల్లగాను ఉంటుంది.
చింతకాయ గుణములు
లేత చింతకాయలు వగరు, పులుపు కలిగిన రుచితో ఉంటాయి. ముదిరిన కాయలు పుల్లగా ఉంటాయి. పండిన తరువాత తీపి, పులుపు కలగలిసిన రుచితో ఉంటాయి. ఈ చింతకాయలు వాతహరములు. మిక్కిలి పైత్య కరము. రక్తదోషమును కలిగిస్తాయి. విరేచనము చేస్తాయి. కడుపు ఉబ్బును పుట్టిస్తాయి. వాపులను పక్వము చేస్తాయి. వ్రణ దోషములను హరిస్తాయి. చింత ఆకు వాపులను హరిస్తుంది.
చింతపువ్వు
వగరు, పులుపు, తీపియును కలిగిన రుచితో ఉంటాయి. అగ్నివృద్ధి చేస్తుంది. వాత కఫములను పోగొడుతుంది.
చింతతో ఔషధాలు
వాపులకు
చింత ఆకు దంచి నేతితోగాని, ఆముదముతో గాని, వట్టిది గాని వెచ్చచేసి పైన కాచినచో వాపులు తగ్గుతాయి.
మశూచికి
పసుపు, చింతాకు రసమును కలిపి తాగించినచో మశూచి తగ్గుతుంది.
రుచి లేకపోవడం
చింతపండు, బెల్లము, దాల్చినచెక్క, ఏలకులు, మిరియాలు కలిపి దంచి ఉండచేసి చిన్న చిన్న ఉండలను బుగ్గనపెట్టుకుని చప్పచిస్తూ ఉంటే నాలుకకు రుచి వస్తుంది.
జలుబు నివారణకు
మిరియాలు వేసిన చింతపండు చారు తాగినచో జలుబు తగ్గుముఖం పడుతుంది.
వాతముల నివారణకు
చింతపండు గుజ్జు , అరటిదుంప రసము, తాటిమట్టల రసము కలిపి వాతము నొప్పులు ఉన్న భాగంపై రాస్తే వాతపు నొప్పులు తగ్గుతాయని భావప్రకాశిక గ్రంథం వివరిస్తోంది.
శుక్ల నష్టమునకు
చింతగింజలు పై పొట్టు తీసి ఎండబెట్టి చూర్ణము చేసి ఆ చూర్ణము పాలతోగాని, తంగేడుపువ్వు కషాయముతోగాని, సేవించినట్లయితే శుక్ల నష్టము తగ్గుతుంది.
ఉబ్బులకు
చింతబెరడు చూర్ణమును గోమూత్రముతో కలిపి సేవిస్తే మల, మూత్రములు జారీ అయి ఉబ్బులు ఉపశమిస్తాయి.
విషహరము
చింతగింజలను గంధంలా అరగదీసి ఆ గంధమును తేలు కుట్టినచోట పైన పూస్తే తేలు విషము హరిస్తుంది.