కొత్తిమీరలో క్యాలరీలు చాలా తక్కువ. కొలెస్ట్రాల్ ఉండకపోగా, ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్ గురించి దిగులు పడేవాళ్లు కొత్తిమీర తింటే చాలు... స్థూలకాయాన్ని తేలిగ్గా నివారించవచ్చు, అదుపులో ఉంచుకోవచ్చు.
కొత్తిమీరలో పొటాషియమ్, క్యాల్షియమ్, మ్యాంగనీస్, ఐరన్, మెగ్నీషియమ్ సమృద్ధిగా ఉంటాయి. పొటాషియమ్ జీవకణం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కొత్తిమీరలోని ఐరన్ రక్తహీనతను నివారించడంతో పాటు ఎర్ర రక్తకణాల ఉత్పాదనకు తోడ్పడుతుంది.
కొత్తిమీరలో విటమిన్–ఏ, విటమిన్–బి కాంప్లెక్స్, విటమిన్–సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కొత్తిమీరలో విటమిన్–సి పాళ్లు ఎంత ఎక్కువంటే ఒక వ్యక్తికి రోజుకు అవసరమైన విటమిన్–సిలో 30 శాతం కొత్తిమీరతోనే లభ్యమవుతుంది.
కొత్తిమీర నోటిక్యాన్సర్లను నిరోధిస్తుంది. న్యూరాన్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ∙రక్తాన్ని గడ్డ కట్టించడంలో కీలక భూమిక నిర్వహించే విటమిన్–కె కొత్తిమీరలో పుష్కలం. ఇందులోని ఔషధ గుణాలు అలై్జమర్స్ వ్యాధి చికిత్సలోనూ ఉపయోగపడతాయి.
కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి కంటికి సంబంధించిన వ్యాధుల నివారణకు ఉపకరిస్తాయి. కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తాయి. హానికరమైన కొవ్వులను తగ్గించి ఆరోగ్యకరమైన కొవ్వుల స్థాయిలు పెరగడానికి దోహదపడతాయి.
చర్మ సౌందర్య పరిరక్షణలో...
చర్మ సౌందర్యాన్ని కాపాడడానికి వాడే అనేక రసాయన మందులలో కొత్తిమీరను ఆకులను ఉపయోగిస్తారు. మొటిమలు, పొడిచర్మం, నల్లటి మచ్చల నివారణకు కొత్తిమీరతో తయారైన ఔషధాలు ఉపకరిస్తాయి. కొత్తిమీరలోని ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల తలనొప్పి, మానసిక అలసట, టెన్షన్లు తగ్గుతాయి. ఎముకలను ధృఢపరచడానికి ఉపకరించే విటమిన్ ‘కె’ కొత్తిమీరలో పుష్కలంగా ఉంది. అంతేకాదు ఇందులో జింక్, కాపర్, పొటాషియం కూడా ఉన్నాయి. జీర్ణకోశ వ్యాధుల నివారణకు కొత్తిమీర ఉపకరిస్తుంది. కొత్తిమీర వల్ల శరీరంలో ఇన్సులిన్ తయారీ పెరుగుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.