‘పొన్నగంటికూర’లో పుష్కలంగా విటమిన్లు



పొన్నగంటి కూర శాస్త్రీయనామం Alternanthera sessilis అమరాంథేసి కుటుంబానికి చెందిన ఒక ఆకుకూర. సంస్కృతంలో మత్యాక్షి, పత్తూర్, హిందీలో గుద్రిసాగ్, కన్నడలో వోనుగొనె సొప్పు, మలయాళంలో మీనన్నాని, పొన్నన్నాని, తమిళంలో పొన్నన్కన్నిక్కిరై అని పిలుస్తారు. భారతదేశమంతటా తేమగల ప్రదేశాలలో పెరుగుతుంది. పెంచబడుతుంది. పొన్నగంటికూర నుంచి ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ 'ఎ', 'బి6', 'సి', ఫొలేట్, 'రైబోఫ్లెవిన్', పొటాషియం, ఇనుము, మెగ్నీషియం దీన్నుంచి సమృద్ధిగా దొరకుతాయి.

గోధుమ పిండి, బియ్యం, ఓట్స్‌లో కంటే ముప్ఫై శాతం ఎక్కువగా ప్రొటీన్లు ఈ కూర ద్వారా అందుతాయి. అమినో ఆమ్లాలూ శరీరానికి లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు పొన్నగంటి కూరను తరచూ తింటే మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి.

ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీన్లో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గౌట్, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. ఒకసారి కూర చేశాక పదే పదే వేడి చేయడం సరికాదు. ఒక్కోసారి వికారానికి దారి తీసే ప్రమాదం ఉంది.

మొక్క వర్ణన


శాఖోపశాఖలుగా నేలపై పాకే ఔషధీ మొక్క. శాఖ కాండలు సాధారణంగా ఊదా రంగులో ఉంటాయి. క్రింది కణుపుల నుండి నేలలోకి వేళ్ళు పాతుకుంటాయి. ఆకులు కొద్ది మందంగా చిన్నవిగా కొలగా కొసగా చిన్న చిన్న బిళ్ళలు వలె ఉంటాయి. ఆకు కాడలు కొద్ది బారుగా వెడల్పుగానే ఉంటాయి. మొక్క పై నూగు లేకుండా నున్నగా ఉంటుంది. పూవులు చిన్నవిగా, తెల్ల రేఖలు ముద్దగా ఉంటాయి. కాయలు పల్చగా ఉంటాయి.

పొన్నగంటి కూర ఔషధ ఉపయోగాలు


రుచి కొద్ది కటువుగా తియ్యగా ఉంటాయి. వగరుగా ఉండి మలబద్దకము కలిగిస్తుంది. రక్తశుద్ధి, జీర్ణశక్తిని పెంపొందించుతుంది. పైత్యమును పెంచుతుంది. క్షీర వర్థని, జ్వరమును తగ్గిస్తుంది. కఫ, పిత్త దోషాలను తగ్గిస్తుంది. శరీరము మంటలు, అతిసారము, కుష్ఠు, చర్మవ్యాధులు, రక్తస్రావము, అజీర్ణము, ప్లీహ సంబంధమైన వ్యాధులకు, జ్వరాలకు పనిచేస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.