కానుగ ఉపయోగాలు
ఈ మొక్క కాండం బెరడు, పత్రాలు, విత్తనాలు, నూనెను వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కలో కరంజిన్, గ్లాబ్రిన్, పొంగాపిన్, పొంగాల్ వంటి రసాయన పదార్ధాలుంటాయి. విత్తనాల నూనెకు అనేక చర్మవ్యాధులను నివారించే శక్తి ఉంది. విత్తనాల పొడిని కఫాన్ని వెడలగొట్టడానికి వాడతారు. కండ్లజబ్బులు, వాతహరం, గౌటు, దగ్గు, కోరింతదగ్గును తగ్గిస్తాయి.
పుష్పాలు మధుమేహ వ్యాధిని నివారిస్తాయి. నూనె అజీర్ణాన్ని పోగొడుతుంది. నూనెను పైన పూస్తే చిడుము, గజ్జి, ఎగ్జిమా, కురుపులు తగ్గిపోతాయి. పత్రాల రసాన్ని వాడితే దగ్గు, అజీర్ణం, విరోచనాలు తగ్గుతాయి. కాండం బెరడును పైకి వాడితే రక్తమొలలు తగ్గుతాయి. కాండం బెరడు కషాయాన్ని వాడితే బెరిబెరి వ్యాధి నివారణ అవుతుంది.
స్త్రీల వ్యాధులు, ప్రేగులలో అడ్డంకులు, ప్లీహ వ్యాధుల నివారణ అవుతాయి. పత్రాలు శరీరానికి పట్టిన నీటిని తొలగిస్తాయి. ఫలాలు మూత్ర సంబంధ వ్యాధులు, మూలశంఖ, చర్మవ్యాధులను నివారిస్తాయి. బెరడు పేస్టును ఎముకలపై పూస్తే విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. వేరు పేస్టును కీళ్ళవాపులపై పూస్తే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. లేత పత్రాలను నూరి, ఆ పేస్టును మూలశంఖ పిలకలపై పూస్తే అవి తగ్గుతాయి.
నూనెను మిరియాలతో నూరి పట్టువేస్తే తలపోటు తగ్గుతుంది. విత్తనాలను ఉడకబెట్టి బెల్లంతో కలిపి తింటే పార్శ్వపోటు తగ్గుతుంది. వృషణాల వాపు తగ్గాలంటే వేరు పేస్టును వాటిపైన పూయాలి. నూనెను, నిమ్మరసంతో కలిపి పైన పూస్తే ఎగ్జిమా తగ్గుతుంది. పత్రాలను లేదా విత్తనాలను నూరి పైన పూస్తే చిడుము, గజ్జి తగ్గుతాయి. సోరియాసిస్ తగ్గుతుంది. గింజల పప్పును తేనెతో కలిపి తీసుకుంటే కోరింత దగ్గు తగ్గుతుంది.